
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను ఆమె ఎండ్యూరెన్స్ టెస్ట్ గా అభివర్ణించడంతోపాటు భారీ నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో చూపించిన అనవసర హింసపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాను చూడకుండా ఎవరికి వారు ఉపకారం చేసుకోవాలని ఆమె అన్నారు. థియేటర్లో సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, ఇది పూర్తిగా పాజ్ చేయాల్సిన సినిమా అని, మన జీవితంలోని నిర్ణయాలను ప్రశ్నించే కంటెంట్ కలిగిన మూవీ అని, ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో టైమ్ పాస్ కోసం మాత్రమే ఈ సినిమాను చూడాలని ఆమె అన్నారు.
హింసనే సినిమాగా చూపించారు..
రణవీర్ ఈ సినిమాను మోస్తున్నాడని చెప్పేవారందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానని రమ్య స్పందన అన్నారు. అతను ఏం మోస్తున్నాడు? నాకు కనిపించింది అతని జుట్టు మాత్రమే. మొదటి భాగంలో అతని జుట్టుకి వ్యక్తిత్వం, ప్రెజెన్స్, పాత్ర ఉండేది. ఈ భాగంలో అది కేవలం అన్నింటికీ అడ్డుగా ఉంది. సీన్లను కప్పేస్తోంది. సపోర్టింగ్ రోల్ నామినేషన్‌కు కూడా అర్హత ఉండొచ్చు.. అని ఆమె అన్నారు. సినిమాలో హింసను గురించి ఆమె మరింత తీవ్రంగా స్పందించారు. ఇది సినిమా కాదు, ఎలాంటి వస్తువునైనా ఎంత సృజనాత్మకంగా హింసాత్మకంగా ఉపయోగించవచ్చో చూపించే ఒక విజువల్ హ్యాండ్బుక్లా ఉంది. అది అసలు ఉండకూడదు. సిరంజ్ వాడారు. స్పానర్ వాడారు. కత్తులు, ముళ్ల బంతులు, మాచెట్లు, రీపర్లు, గొలుసులు, గన్స్, బాంబులు, బజూకాలు, షట్టర్లు.. ఏది చెప్పినా దాన్ని ఆయుధంగా మార్చేశారు.. అని ఫైరయ్యారు.
Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.
It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026
బోరింగ్‌గా, కామెడీగా ఉంది..
ఆమె ఇంకా కొనసాగిస్తూ.. దర్శకుడు తనతోనే ఒక పోటీలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తర్వాతి సీన్‌ను ఇంకాస్త హింసాత్మకంగా లేదా కామెడీగా ఎలా చేయాలి? అని ఆలోచించి తీసినట్లున్నారు. అది చివరికి షాక్ ఇవ్వడం మానేసి హాస్యాస్పదంగా మారింది. ఇద్దరి కాళ్లు కోసినా, శరీరాన్ని కిరోసిన్‌లో ముంచినా, ఆ వ్యక్తి ఇంకా TED టాక్ ఇస్తున్నట్టు డైలాగులు చెబుతాడు. మెడికల్ సైన్స్‌కు జై. ఆస్కార్ మరిచిపోండి, నోబెల్ ప్రైజ్ సిద్ధంగా ఉంది.. అని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ధురంధర్ 2 ఒక భారీ నిరాశ. బోరింగ్ లేదా కామెడీగా మాత్రమే అనిపిస్తుంది. మొదటి భాగం మీకు ఆనందాన్ని ఇచ్చి ఉంటే, ఈ రెండో భాగం ఎందుకు అని మీరు ప్రశ్నించేలా చేస్తుంది. రణవీర్, మీరు దీనికంటే మెరుగైనవారు. ఆదిత్య ధర్.. జింగోయిజం, ప్రొపగాండా ఇప్పుడు పాతవే. వాటిని దాటండి.. అని ఆమె చెప్పుకొచ్చారు.
బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు..
ఇదిలా ఉండగా, రణవీర్ సింగ్ నటించిన ధురంధర్‌కు సీక్వెల్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. విడుదల రోజునే రూ.102.55 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. మార్చి 18, 2026న జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా మాత్రమే భారత్‌లో రూ.43 కోట్లు రాబట్టింది, కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు అయినప్పటికీ, ఆలస్యాలు ఉన్నప్పటికీ ఈ వసూళ్లు సాధించింది. మార్చి 20 నాటికి భారత్‌లో మొత్తం కలిపి రూ.145.55 కోట్లు వసూలు చేసినట్లు సాక్నిల్క్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రివ్యూల ద్వారా సుమారు రూ.75 కోట్లు (గ్రాస్) వసూలయ్యాయి. మొదటి రోజు అనంతరం మొత్తం కలిపి రూ.240 కోట్లకు చేరుకుంది. అందులో ఒక్క రోజులోనే రూ.165 కోట్లు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. సాక్నిల్క్ ప్రకారం, ఓపెనింగ్ డేలో రూ.102.55 కోట్లు రాగా, అందులో హిందీ వెర్షన్ నుంచే రూ.99.10 కోట్లు వచ్చాయి. టెక్నికల్ సమస్యలు, కంటెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల పెయిడ్ ప్రివ్యూలు జరగని కన్నడ, మలయాళ వెర్షన్లు వరుసగా రూ.0.8 కోట్లు, రూ.0.9 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. తమిళ వెర్షన్ భారత్‌లో 958 షోల ద్వారా రూ.1.16 కోట్లు సంపాదించింది. తెలుగు వెర్షన్ మొత్తం రూ.2.12 కోట్లు వసూలు చేసింది.












