చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి పైగా సక్సెస్ రేట్‌ను సాధించ‌డం సంతోషంగా ఉంద‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్ ఈ నెల 28న ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లు పెట్టాయి.

March 19, 2026 6:36 PM
Suryakumar Yadav talking about his captaincy success rate during MI practice camp.
ఐపీఎల్ 2026 ప్రాక్టీస్ సెషన్‌లో తన స్కూల్ రోజులను గుర్తుచేసుకున్న సూర్యకుమార్ యాదవ్. Photo Credit: PTI/X.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి పైగా సక్సెస్ రేట్‌ను సాధించ‌డం సంతోషంగా ఉంద‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్ ఈ నెల 28న ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లు పెట్టాయి. ఆరంభ మ్యాచ్ బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నుండ‌గా అందులో ఆతిథ్య జ‌ట్టు హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ముంబై ఇండియ‌న్స్ శిక్ష‌ణ శిబిరంలో ప్లేయ‌ర్లు పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే మీడియాతో మాట్లాడిన సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న భార‌త‌ టీ20 జ‌ట్టు కెప్టెన్సీపై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. చ‌దువుల్లో అనుకున్నంత రాణించ‌క‌పోయినా, క్రికెట్‌లో స‌త్తా చాటుతున్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నాడు.

80 శాతానికి పైగా సక్సెస్ రేట్‌..

సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త టీ20 క్రికెట్ జ‌ట్టు ఇటీవ‌లే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ట్రోఫీని సాధించిన విష‌యం తెలిసిందే. టోర్న‌మెంట్‌లో సూప‌ర్ 8 ద‌శ‌లో ఒక్క సౌతాఫ్రికాతో త‌ప్ప టీమిండియా ఏ జ‌ట్టుతోనూ ఓడ‌లేదు. అద్భుత‌మైన పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను దాటేశాడు. అత‌ని సక్సెస్ రేట్ ప్ర‌స్తుతం 80కి పైగా ఉంది. ముంబైకి చెందిన సూర్య 2024లో భార‌త టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. గ‌తంలో ముంబైకి రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించ‌గా, ప్ర‌స్తుతం హార్దిక్ పాండ్యా ఆ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నాడు.

చ‌దువుల్లో 50-60 శాత‌మే వ‌చ్చేది..

అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌లో కెప్టెన్‌గా 80 శాతానికి పైగా స‌క్సెస్ రేటుతో కొన‌సాగుతుండ‌డంపై సూర్య స్పందిస్తూ తాను స్కూల్‌, కాలేజీ చ‌దువుల్లో ఆ శాతం సాధించాల‌ని అనుకున్నాన‌ని, కానీ ఇప్పుడు క్రికెట్‌లో ఆ శాతాన్ని సాధించాన‌ని తెలిపాడు. సూర్య కెప్టెన్సీలో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు 52 టీ20 మ్యాచ్‌లు ఆడగా 42 మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించింది. తాను స్కూల్‌లో ఎప్పుడూ 50 నుంచి 60 శాతం మార్కుల‌నే సాధించేవాడిన‌ని, కానీ క్రికెట్‌లో 80 శాతానికి పైగా కెప్టెన్‌గా స‌క్సెస్ సాధిస్తున్నాన‌ని, ఇది త‌న‌కు ఎంతో ఆనందాన్నిస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే తాను గ‌ణాంకాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌న‌ని, ఏ ఆట‌లోనైనా ఎవ‌రికీ ఓడిపోవ‌డం ఇష్టం ఉండ‌ద‌ని అన్నాడు. కానీ మ్యాచ్‌ల‌ను గెలిచేందుకు త‌న శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని వెల్ల‌డించాడు.

ఫ్యామిలీ స‌పోర్ట్‌తో..

సూర్య కుమార్ యాద‌వ్ తండ్రి అశోక్ కుమార్ యాద‌వ్ బాబా అణు ప‌రిశోధ‌న కేంద్రం (బార్క్‌)లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌గా ప‌నిచేశారు. అయితే సూర్య‌కు చ‌దువుల‌పై పెద్ద‌గా ఆస‌క్తి లేద‌ని గ‌మ‌నించిన ఆయ‌న అత‌ని దృష్టిని క్రికెట్ వైపు మ‌ళ్లించారు. క్రికెట్ పై ఆస‌క్తి క‌లిగేలా చేయ‌డంతోపాటు సూర్య‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌పోర్ఠ్‌గా నిలిచి ఇంత‌టి వాడిని చేశారు. ఈ సందర్భంగా సూర్య త‌న కుటుంబం గురించి కూడా వ్యాఖ్య‌లు చేశాడు. త‌న కుటుంబం త‌న‌ను ముందుగా బాగా చ‌దివించాల‌ని అనుకుంద‌ని, కానీ త‌న‌కు చ‌దువుల‌పై ఆస‌క్తి లేద‌ని గ‌మ‌నించార‌ని, త‌రువాతే తాను క్రికెట్‌లోకి వ‌చ్చాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం తాను క్రికెట్ ఆట‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాన‌ని, ఆడ‌టాన్ని ఇష్ట‌ప‌డుతున్నాన‌ని అన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment