
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో ఈ పంథా కొనసాగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు ఈ విషయం పట్ల సీనియర్ హీరోలను విమర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఇలాంటి విమర్శలే రావడంతో నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. బాలీవుడ్‌లోనూ సీనియర్ హీరోలు ఇటీవలి కాలంలో యంగ్ హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నారు. దీంతో వారి మధ్య వయస్సు వ్యత్యాసంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తన రాబోయే చిత్రం భూత్ బంగ్లా ప్రమోషన్లలో భాగంగా అక్షయ్ కుమార్ ఈ అంశంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో ఆయనకు జోడీగా వామికా గబ్బి నటించగా, ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్ ఉంది. దీంతో అక్షయ్ స్పందించారు. వయస్సు వ్యత్యాసం ఉన్నా ఏమీ కాదని, ఈ తరహా శైలి ఎప్పటి నుంచో ఉందని అన్నారు.
కథ అవసరం ఉంటే తప్పదు: అక్షయ్ కుమార్
హీరో హీరోయిన్ల మధ్య వయస్సు వ్యత్యాసం ఉండడం సహజమే అని, ప్రేక్షకులు ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదని, ఈ విధానాన్ని మనం గతంలోనూ చూశామని అక్షయ్ అన్నారు. హాలీవుడ్‌లోనూ ఇలాగే జరుగుతుందని, కొన్ని సార్లు కథకు అవసరమైనప్పుడు అలా నటించాల్సి వస్తుందని తెలిపారు. నిజ జీవితంలోనూ చాలా మంది సెలబ్రిటీలు తమకన్నా వయస్సులో పెద్దలనో లేదా చిన్న వారినో పెళ్లి చేసుకుంటున్నారని, భూత్ బంగ్లా షూటింగ్ సమయంలోనే తాను మొదటిసారి వామీని కలిశానని తెలిపారు. ఆమె పనిచేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని, సీన్ల గురించి నిరంతరం చదువుతూ, రిహార్సల్స్ చేస్తూ చాలా సీరియస్‌గా ఉంటుందని పేర్కొన్నారు. వామికా గబ్బి గొప్ప నటి అని అక్షయ్ కితాబిచ్చారు.
వయస్సు చూడకండి, సినిమాను చూడండి: ప్రియదర్శన్
ఇదే అంశంపై దర్శకుడు ప్రియదర్శన్ సైతం స్పందించారు. నటీనటుల పాత్రలను మాత్రమే చూడాలని, వారి వయస్సు వ్యత్యాసాన్ని చూడొద్దని కోరారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులు చెప్పినట్లు, ఒక నటుడి అసలు వయస్సుకి, స్క్రీన్ వయస్సుకి చాలా తేడా ఉంటుందని, ప్రేక్షకులు స్టార్లను స్క్రీన్‌పై కనిపించిన విధంగానే గుర్తుంచుకుంటారని అన్నారు. ఇందులో తనకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని, దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా భూత్ బంగ్లా మూవీ ఏప్రిల్ 10, 2026న రిలీజ్ కానుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో విడుదల కానున్న ఈ సినిమాలో అక్షయ్, వామికాతోపాటు పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తుండగా హార్రర్, కామెడీ జోనర్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.












