
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22 లక్షల విలువ చేసే టాటా కర్వ్ కారును అతనికి టాటా మోటార్స్ బహుకరించింది. షోరూంలో వైభవ్ కారును ఆవిష్కరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇటీవల జరిగిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినందుకు గాను అతనికి తాజాగా బీహార్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేసింది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ప్రత్యేకంగా వైభవ్‌కు నగదును అందజేశారు. ఇక ఇప్పుడు టాటా మోటార్స్ ఈ కారును బహుకరించి సత్కరించింది. గడిచిన ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పలు మ్యాచ్‌లలో అద్బుతమైన ప్రదర్శన చేసి స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు టాటా మోటార్స్ వారు ఈ గిఫ్ట్‌ను అతనికి ఇచ్చారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా..
ఇటీవల నిర్వహించిన ఐసీసీ అండర్ 19 క్రికెట్ వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టుపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారత్ 6వ సారి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో టీం మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నగదును నజరానాగా అందజేసింది. అయితే అప్పటి నుంచి వైభవ్ ఇలా ఏదో ఒక రూపంలో గిఫ్ట్‌లను అందుకుంటూనే ఉన్నాడు. ఇక వైభవ్ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మొత్తం 439 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లోనే అతను 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదడం విశేషం. అతను కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
🚨Tata Motors has gifted a Tata Curvv car to Vaibhav Suryavanshi. He was seen personally receiving the car.
Vaibhav is steadily emerging as a future star. With his performances so far, he has impressed everyone and made his parents truly proud.
Looking ahead, he has all the… pic.twitter.com/KDsx1F4eak
— Sonu (@Cricket_live247) February 24, 2026
ఐపీఎల్ 2025లో మెరుపు శతకం..
గడిచిన ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకోగా ఐపీఎల్‌లో అంతటి భారీ ధర పలికిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ జట్టుకు ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడిన వైభవ్ ఓ మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ఔరా అనిపించాడు. ప్రపంచ స్థాయి ప్లేయర్లు పాల్గొన్న ఆ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లను సైతం అతను ఉతికి ఆరేయడం చూసిన కొందరు మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే అతనికి అంత టాలెంట్ ఎలా వచ్చిందని విస్మయం వ్యక్తం చేశారు కూడా. ఇక వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతుండగా ఈసారి అతను ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












