రోహిత్ రికార్డుకు సూర్య చెక్.. టీ20ఐల్లో నంబర్ 1 కెప్టెన్‌గా స్కై!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లోనే కాదు, అంత‌కు ముందు కూడా భార‌త జ‌ట్టును కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ విజ‌యాల బాట‌లో న‌డిపిస్తూ వ‌స్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5 టీ20ల సిరీస్‌లో సూర్య అనూహ్యంగా ఫామ్‌లోకి వ‌చ్చి దాన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగిస్తున్నాడు.

February 22, 2026 12:48 PM
Suryakumar Yadav and Rohit Sharma T20I captaincy win rate comparison.
భారత టీ20 జట్టు విజయవంతమైన కెప్టెన్లుగా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ. Photo Credit: PTI.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లోనే కాదు, అంత‌కు ముందు కూడా భార‌త జ‌ట్టును కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ విజ‌యాల బాట‌లో న‌డిపిస్తూ వ‌స్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5 టీ20ల సిరీస్‌లో సూర్య అనూహ్యంగా ఫామ్‌లోకి వ‌చ్చి దాన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగిస్తున్నాడు. ఆ సిరీస్‌కు ముందు అనేక ఇన్నింగ్స్‌లో సూర్య అస‌లు ఫామ్‌లో లేడు. అయినప్ప‌టికీ కెప్టెన్‌గా స‌క్సెస్ అయ్యాడు. ఇక తాజాగా అత్యంత సక్సెస్ సాధించి అత్య‌ధిక విన్ రేట్ క‌లిగిన టీ20ఐ జ‌ట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాద‌వ్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు పోటీ వ‌చ్చాడు. కెప్టెన్లుగా ఈ ఇద్ద‌రి విజ‌యాల శాతం టీ20ఐల‌లో ప్ర‌స్తుతం స‌మానంగా ఉండ‌డం విశేషం. ఇంకా చెప్పాలంటే డెసిమ‌ల్ పాయింట్ల‌లో లెక్కిస్తే సూర్య కుమార్ యాద‌వ్ ఇంకాస్త మెరుగైన స్థానానికి చేరుకుని నంబ‌ర్ వ‌న్‌గా ఉన్నాడు.

డెసిమ‌ల్ పాయింట్ల‌లోనే తేడా..

టీ20ఐల‌లో అత్య‌ధిక విజ‌యాల శాతం క‌లిగిన కెప్టెన్ల జాబితాలో సూర్య కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుతం మొద‌టి స్థానంలో ఉండ‌గా, కేవ‌లం డెసిమ‌ల్ పాయింట్ల తేడాతో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. సూర్య కెప్టెన్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 47 మ్యాచ్‌ల్లో భార‌త్ త‌ర‌ఫున ఆడ‌గా వాటిల్లో 38 విజ‌యాలు ఉన్నాయి. దీంతో సూర్య విజ‌యాల శాతం 80.85 గా ఉంది. అలాగే రోహిత్ శ‌ర్మ టీ20ఐల‌లో భార‌త్‌కు 62 మ్యాచ్‌ల‌లో నాయ‌క‌త్వం వ‌హించ‌గా వాటిల్లో 50 విజ‌యాలు ఉన్నాయి. దీంతో రోహిత్ విజ‌యాల శాతం 80.65 గా ఉంది. అంటే రౌండ్ ఫిగ‌ర్‌లో ఇద్ద‌రూ స‌మానంగానే ఉన్నారు. కానీ డెసిమ‌ల్ పాయింట్లలో తేడా కార‌ణంగా 0.20 శాతం అధిక విలువ‌తో సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇక ఈ జాబితాలో ఆఫ్గ‌నిస్థాన్ మాజీ కెప్టెన్ అజ్గ‌ర్ ఆఫ్గ‌న్ 3వ స్థానంలో ఉన్నాడు.

ఫామ్‌లోనే ఉన్న సూర్య‌..

సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన లీగ్ మ్యాచ్‌ల‌లో బాధ్య‌తాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫిబ్ర‌వ‌రి 7న యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో 84 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచిన అత‌ను నమీబియాతో ఫిబ్ర‌వ‌రి 12న జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగులే చేశాడు. కానీ మ‌ళ్లీ ఫిబ్ర‌వ‌రి 15న పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 32 ప‌రుగులు చేసి చాలా సేపు క్రీజులో ఉండి స‌హ‌చ‌ర బ్యాట్స్‌మెన్ ప‌రుగులు చేయ‌డంలో ప్రేర‌ణాత్మ‌కంగా నిలిచాడు. త‌రువాత చివ‌ర‌గా నెద‌ర్లాండ్స్‌తో ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన జ‌రిగిన మ్యాచ్‌లోనూ జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ 34 ప‌రుగుల‌తో బాధ్య‌తాయుత ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు భారీ స్కోరు చేసేందుకు మార్గం సుగ‌మం చేశాడు. నాయ‌కుడిగానే కాకుండా బ్యాటర్‌గా కూడా సూర్య ఫామ్‌లో ఉండ‌డం టీమిండియాకు ఈ టోర్నీలో క‌ల‌సి వ‌చ్చే అంశంగా మారింది. ఫ్యాన్స్ కూడా ఆయ‌న సార‌థ్యంలో ఈసారి టీమిండియా క‌ప్ గెల‌వాల‌ని కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment