
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం ఎరుపు, నలుపు మట్టితో కూడిన మిశ్రమ పిచ్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ 2 మ్యాచ్ కోసం కూడా ఇలాంటి పిచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 253 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అహ్మదాబాద్ పిచ్ కూడా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుందని, బౌలర్లకు చాలా తక్కువ టర్న్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ పిచ్‌ను ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో రూపొందిస్తున్నారని సమాచారం. అందువల్ల బౌలర్లకు చక్కని బౌన్స్ లభించడంతోపాటు బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. ఈ పిచ్‌పై సరిగ్గా ఆడితే ఏ జట్టు అయినా సరే అలవోకగా టీ20లో 200 స్కోరు సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బ్యాటర్లకు అనుకూలంగా పిచ్..
అయితే ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌ను ఇప్పటికే ఒకసారి ఈ టోర్నీలో ఉపయోగించారు. సౌతాఫ్రికా, కెనడాల మధ్య జరిగిన మ్యాచ్ కోసం ఆ పిచ్‌ను వాడారు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడింది. భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం అహ్మదాబాద్ పిచ్‌ను ఎక్కువగా ఎరుపు రంగు మట్టితో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ చక్కని బౌన్స్ ఉంటుందని కూడా అనుకుంటున్నారు.
అధిక భాగం ఎరుపు మట్టితోనే..
పిచ్‌ను నలుపు రంగు మట్టితో కాకుండా ఎక్కువగా ఎరుపు రంగు మట్టిని వాడి సిద్ధం చేయడం వల్ల బ్యాటర్లకు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెబతున్నారు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఇదే మైదానంలో జరిగినప్పుడు పూర్తిగా నలుపు రంగు మట్టితో పిచ్‌ను రూపొందించారు. ఆ పిచ్‌పై భారత్ తడబడింది. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లోనూ ఆ జట్టు చేతిలో భారత్ 70 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టు మేనేజ్మెంట్ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక ఇన్నింగ్స్‌లో ఒకలా, రెండో ఇన్నింగ్స్‌లో మరోలా పిచ్ ప్రవర్తించడం కరెక్ట్ కాదని పిచ్ క్యురేటర్లకు గంభీర్ సారథ్యంలోని జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పిచ్‌ను పూర్తిగా నలుపు రంగు మట్టితో కాకుండా అధిక భాగం ఎరుపు మట్టితో రూపొందించినట్లు తెలుస్తోంది.
ఫైనల్లో వరుణ్ మ్యాజిక్ చేస్తాడా..
అయితే టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇప్పటి వరకు సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు హై రిస్క్, హై రివార్డు అనే వ్యూహంతో మ్యాచ్‌లను ఆడింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోనూ అదే వ్యూహం పనిచేసింది కూడా. సంజు శాంసన్ జట్టులో చేరడంతో మిడిలార్డర్లో స్థిరత్వం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. దీని వల్ల ప్రత్యర్థి జట్లను కౌంటర్ అటాక్ చేసేందుకు వీలు కలిగిందని అంటున్నారు. లైట్స్ వెలుతురులోనూ ఆడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే పిచ్ ఎంత బ్యాటర్లకు అనుకూలించినా టీమిండియాను ఇప్పుడు కలవరపెడుతున్న అంశం బ్యాటింగ్ కాదు, బౌలింగ్. గత మ్యాచ్‌లో కేవలం బుమ్రా ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ మ్యాచ్‌ను గెలవగలిగింది. లేదంటే అంతటి భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఉండేవారు. వరుణ్ చక్రవర్తి నిరంతరంగా ఫెయిల్ అవుతుండడంతో స్పిన్ విభాగంలో లోటు కనిపిస్తోంది. మరి ఫైనల్ లో అయినా వరుణ్ కమ్ బ్యాక్ ఇస్తాడా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.












