
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది. న్యూజిలాండ్‌పై భారత్ ఆధిపత్య ప్రదర్శన చేసినప్పటికీ, మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అర్ష్‌దీప్ వేసిన త్రో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ శరీరాన్ని తాకింది. దీనితో అసహనం వ్యక్తం చేసిన మిచెల్ అర్ష్‌దీప్‌తో వాగ్వివాదం చేశాడు. అనంతరం మైదానంలోని అంపైర్లు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని వెంటనే సరిచేశారు. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ మిచెల్‌కు క్షమాపణ చెప్పి తన చర్యకు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ఘటనను ఐసీసీ పరిశీలించింది. చివరకు అతను కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
అర్షదీప్‌కు గంభీర్ మద్దతు..
కాగా తాజాగా మీడియాతో జరిగిన సంభాషణలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అర్ష్‌దీప్‌కు మద్దతుగా మాట్లాడాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆగ్రహం లేదా పోరాట స్పూర్తి చూపడం సహజమని ఆయన పేర్కొన్నారు. మీరు మీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొంత ఆగ్రహం చూపడం సహజం. అందులో తప్పు ఏమీలేదు. మీరు బంతిని తిరిగి విసిరినా అది కూడా పూర్తిగా సహజమే. ప్రపంచంలో ఏ బౌలర్ అయినా రెండు సిక్సులు ఇచ్చిన తర్వాత నిశ్శబ్దంగా ఉండాలని కోరుకోడు. నా ఆటగాళ్లలో నేను చూడాలనుకునే ప్రతిస్పందన అదే. అర్ష్‌దీప్ డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పకపోయినా నాకు సమస్య ఉండేది కాదు.. అని గంభీర్ తెలిపారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ అతను క్షమాపణ చెప్పడం మంచి విషయం. కానీ క్రికెట్ మైదానంలో స్నేహితులు లేదా శత్రువులు అనే విషయం ఉండదు. మీ పని మీ దేశం కోసం మ్యాచ్‌లను గెలిపించడం మాత్రమే.. అని ఆయన అన్నారు.
రూల్ ఉల్లంఘనే..
అర్ష్‌దీప్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఆర్టికల్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో బంతి లేదా ఇతర క్రికెట్ పరికరాలను ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ ఈ ఘటనపై స్పందించాడు. తాను వెంటనే మిచెల్‌కు క్షమాపణ చెప్పినట్లు వివరించాడు. నేను మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాను. నేను వేసిన త్రో కొంచెం రివర్స్ స్వింగ్ అయి అతని శరీరాన్ని తాకింది. నేను ఉద్దేశపూర్వకంగా అతన్ని తాకలేదు అని చెప్పాను.. అని అర్ష్‌దీప్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో వెల్లడించాడు.












