
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో నమోదు చేయలేదు. యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో అతని ఆటతీరుపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2026కు ప్రధాన శాటిలైట్ బ్రాడ్ కాస్టర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడాడు. తాను తన బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తానని, గత 2 ఏళ్ల నుంచి అసలు ఒత్తిడి అంటే తనకు తెలియదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నా ఆటతీరును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా చేతుల్లోనే ఉంది.. అని అన్నాడు.
దూకుడు కొనసాగిస్తా, ఉద్దేశం మారదు: అభిషేక్ శర్మ
ప్రాక్టీస్ లేదా శిక్షణ ఏదైనా సరే తాను నిరంతరం సాధన చేస్తూనే ఉంటానని అభిషేక్ ఈ సందర్భంగా తెలిపాడు. ఒక బ్యాటర్ కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. నా ఫామ్ గురించి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. రీసెంట్ గా జరిగిన మ్యాచ్‌లలో నా ప్రదర్శనను పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి అన్నదానిపైనే నేను ఫోకస్ పెట్టా. కచ్చితంగా నా ఆటతీరును ఇంకా మెరుగు పరుచుకుంటా.. అని అభిషేక్ స్పష్టం చేశాడు. ఒత్తిడి లేకపోవడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని, ఒక బ్యాటర్‌గా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందని అతను అన్నాడు. కొన్నిసార్లు కొన్ని ఇన్నింగ్స్‌లో బాగా ఆడతామని, కొన్ని సార్లు ఆడలేకపోతామని, మ్యాచ్‌లలో మాత్రం ఒకేలాంటి దూకుడును కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ విధానం వల్ల అన్ని సార్లు ఫలితాలు రావని, కానీ తన ఉద్దేశాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని అభిషేక్ తేల్చి చెప్పాడు.
“I won’t ever change my process and mindset.” 📈#AbhishekSharma ‘BELIEVES’ in himself as India march into the Super 8 vs #SouthAfrica. 💪
Predict his score against South Africa in the comments.🧐
ICC Men’s #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/kgNbhfsWC1
— Star Sports (@StarSportsIndia) February 21, 2026
ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్ పదిలం..
కాగా అభిషేక్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లలో బ్యాటర్ ర్యాంకింగ్‌లలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల తాను ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయినప్పటికీ అది అతని ర్యాంక్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాలో అభిషేక్ ఇప్పటికీ ఇంకా నంబర్ వన్ స్థానంలోనే ఉన్నాడు. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో అతను ఔట్ అవుతుండడం వల్ల ప్రత్యర్థి జట్లకు అతని బలహీనత తెలిసిపోయిందని భావిస్తున్నారు. కనుక ఇకపై ఆడే మ్యాచ్‌లలో అభిషేక్‌కు ముందుగా పేస్ బౌలర్‌కు బదులుగా ఆఫ్ స్పిన్ బౌలర్‌తో బౌలింగ్ చేయించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే అభిషేక్ శర్మ తిరిగి తన మునుపటి ఫామ్ ను కొనసాగించాలని, సూపర్ 8 దశ ప్రారంభం నేపథ్యంలో అతని నుంచి ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ముందు ముందు జరగబోయే మ్యాచ్‌లలో అభిషేక్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.












