గురువారం, జూన్ 11, 2026
వినోదం

‘టాక్సిక్’ విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన యష్‌! కారణం ఏంటంటే?

ఇటీవ‌లి కాలంలో అనేక చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన చాలా వ‌ర‌కు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌న్న‌డ న‌టుడు య‌ష్ న‌టించిన టాక్సిక్ కూడా ప‌లు ద‌ఫాల వాయిదాల అనంతరం వ‌చ్చే జూన్ 4న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చారు.

‘టాక్సిక్’ విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన యష్‌! కారణం ఏంటంటే?
Superstar Yash confirming Toxic movie release date postponement on Instagram.
‘టాక్సిక్’ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన రాకింగ్ స్టార్ యశ్. Photo Credit: Yash/Instagram.

ఇటీవ‌లి కాలంలో అనేక చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన చాలా వ‌ర‌కు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌న్న‌డ న‌టుడు య‌ష్ న‌టించిన టాక్సిక్ కూడా ప‌లు ద‌ఫాల వాయిదాల అనంతరం వ‌చ్చే జూన్ 4న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చారు. సినిమా విడుద‌ల మ‌రోమారు వాయిదా ప‌డింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని న‌టుడు య‌ష్ త‌న సోష‌ల్ ఖాతాల వేదిక‌గా ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. కొన్ని చిత్రాలు అస‌లు మ‌న‌మెందుకు సినిమాల్ని ప్రేమించామో గుర్తు చేస్తాయ‌ని, త‌న‌కు టాక్సిక్ కూడా అలాంటిదేన‌ని, ఇది త‌న‌కు ఓ ప్ర‌యాణం లాంటిద‌ని య‌ష్ అన్నారు. అయితే టాక్సిక్ మ‌ళ్లీ ఎప్పుడు విడుద‌ల‌య్యేది ఆయ‌న వెల్లడించ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

త్వ‌ర‌లోనే మ‌రో తేదీ ప్ర‌క‌ట‌న‌..

ఇక త‌న పోస్టులో భాగంగా య‌ష్ మ‌రింత స్పందిస్తూ.. టాక్సిక్ సినిమాకు ఇటీవ‌ల సినిమాకాన్‌లో విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింద‌ని, ఆ ఆద‌ర‌ణ‌ను చూశాక ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రికీ చేరాల్సిన చిత్ర‌మ‌ని అర్థ‌మైంద‌ని తెలిపారు. దీని కోసం ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా పంపిణీ, భాగ‌స్వామ్యాల్ని కాంటాక్ట్ అవుతున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే త‌మ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామ‌ని, జూన్ 4న విడుద‌ల చేయ‌బోవ‌డం లేద‌ని స్పష్టం చేశారు. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రికీ అందుబాటులో ఉండేలా సినిమాను ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, అందుకు త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు.

షూటింగ్ ఎప్పుడో పూర్తయినా..

కాగా టాక్సిక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. ఈపాటికే ఈ సినిమా విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా, అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చి, ఇప్పుడు మళ్లీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. న‌టుడిగా, నిర్మాత‌గా భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ గ‌ర్వ‌ప‌డే లాంటి చిత్రం చేయ‌డ‌మే త‌న బాధ్య‌త‌గా భావిస్తున్నాన‌ని య‌ష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. కొన్ని క‌థ‌ల‌కు ఓపిక అవ‌స‌ర‌మ‌ని, ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాను అందించ‌బోతున్నాన‌ని మాట ఇస్తున్నాన‌ని తెలిపారు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన టాక్సిక్ మూవీకి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని మార్చిలో విడుద‌ల చేయాల‌ని గ‌తంలో భావించారు. ప‌శ్చిమాసియాలో యుద్ధం కార‌ణంగా చిత్ర విడుద‌ల‌ను జూన్‌కు వాయిదా దేశారు. అయితే గ్లోబ‌ల్ స్థాయిలో ఇంకా ఉద్రిక్త‌త‌లు అలాగే ఉండ‌డంతో సినిమాను మ‌రోమారు వాయిదా వేశారు. దీంతో య‌ష్ అభిమానులే కాకుండా, సినీ ప్రేక్ష‌కులు కూడా నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. ఆ మూవీ ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ సామాజిక మాధ్య‌మాల్లో అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి