
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంతరం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను నిదానంగానే ప్రారంభించినా ప్రస్తుతం షూటింగ్ మాత్రం శరవేగంగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాకు సంబంధించిన విశేషాలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలోఆయన వెల్లడించారు. వారణాసి షూటింగ్ దాదాపుగా 50 శాతం వరకు పూర్తయిందని చెప్పిన రాజమౌళి మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తామని తెలిపారు. సినిమాలో కీలక ఘట్టంగా భావిస్తున్న రామాయణ సన్నివేశాలను ఇప్పటికే మొత్తం పూర్తి చేశామని, అయితే సినిమాలో ఇంకా 50 శాతం షూటింగ్ మిగిలి ఉందని, దాన్ని జూన్ 2026 వరకు పూర్తి చేస్తామని రాజమౌళి తెలిపారు.
విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా ఉంది: రాజమౌళి
సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తన ఫోకస్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టనున్నట్లు రాజమౌళి తెలిపారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా ఉందని ఆయన వెల్లడించారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రన్ టైం సుమారుగా 3 గంటలు ఉంటుందని రాజమౌళి తెలిపారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలాగా వారణాసిలో నాటు నాటు లాంటి పాటను పెట్టడం లేదని, కనుక అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఎమోషనల్ సన్నివేశాలు..
అయితే సినిమాను ప్రభావితం చేసేంతగా నాటు నాటు లాంటి పాటలు లేకపోయినా వారణాసిలో మాత్రం అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశాలు, అత్యంత భారీ నిర్మాణాత్మక విలువలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్‌కు కొదువ లేదని రాజమౌళి స్పష్టం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు, ఓ ముఖ్యమైన ఘట్టానికి సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా చేయాల్సి ఉంటుందని, అందుకు చాలా సమయం పట్టవచ్చని రాజమౌళి చెప్పారు. కాగా వారణాసి సినిమాలో మళయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని 2027 ఏప్రిల్ మొదటి లేదా చివరి వారంలో సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.








