
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్‌లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా, బలమైన కథా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ఎంచుకున్న సినిమాలతోనే అగ్రస్థాయికి ఎదిగిన ఆమె, ఇప్పటికే ఎన్నో సున్నితమైన పాత్రలను సహజమైన అభినయంతో చేసి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె కెరీర్‌లో అత్యంత కీలక దశ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో సాయి పల్లవి నటించబోతున్నారు. వాటిలో ఒకటి దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్న మహా కావ్య రూపాంతరం రామాయణం, మరొకటి బ్లాక్‌బస్టర్ సీక్వెల్ కల్కి రెండో భాగం.
రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో..
పౌరాణిక మహా చిత్రమైన రామాయణంలో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయకుడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. సీతాదేవి వంటి దైవిక, ప్రతీకాత్మక పాత్రను పోషించడం అంటే అపారమైన బాధ్యత. ప్రేక్షకులు, విమర్శకులు ఆమె నుంచి కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ఆశించడం సహజం. ఇక కల్కి బృందానికి దగ్గర వర్గాల సమాచారం ప్రకారం, సీక్వెల్‌లో కీలకమైన సుమతి (సమ్-80) పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర గతంలో దీపికా పదుకొణె చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఆమె స్థానంలో సాయి పల్లవి కనిపించనున్నారని సమాచారం. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, భారీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ప్రభావవంతమైన పాత్రగా ఇది నిలవనుందని తెలుస్తోంది.
కెరీర్‌లో మరో స్థాయికి..
ఈ రెండు ప్రాజెక్టుల్లో ఆమె ఎంపికపై మొదట్లో కొంత విమర్శలు వచ్చినప్పటికీ, తన ప్రతిభతో వాటన్నింటికీ సాయి పల్లవి సమాధానం ఇస్తుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సహజ నటనలో ఆమెకు తిరుగులేదని, ఈ పాత్రలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రామాయణం, మహాభారత ప్రేరణతో రూపొందుతున్న రెండు పౌరాణిక ఫాంటసీ చిత్రాల్లో కీలక పాత్రలు దక్కించుకోవడం ద్వారా, భారత సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించేందుకు సాయి పల్లవి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.








