
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. సాక్‌నిల్క్ నివేదికల ప్రకారం ఈ మూవీ ఇప్పటికే రూ.1700 కోట్ల కలెక్షన్లను దాటేసిందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ వసూళ్ల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక సినిమాను వీక్షించిన చాలా మంది సెలబ్రిటీలు మేకర్స్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆ జాబితాలో తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కూడా చేరిపోయారు. వీరు ధురంధర్ 2 సినిమాను ఇటీవలే చూశామని, సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. ఈ మేరకు వారు వేర్వేరుగా తమ సోషల్ ఖాతాల్లో పోస్టులు కూడా పెట్టారు. అయితే వారి పోస్టుల పట్ల దర్శకుడు ఆదిత్య ధర్ కూడా స్పందించి వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదు..
ధురంధర్ 2 సినిమాకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు రివ్యూ ఇవ్వడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధురంధర్ ఫ్యాన్స్ క్లబ్‌లో వారు కూడా చేరడంపై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశారు. ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సినిమాను చూశామని, దర్శకుడు చక్కగా చిత్రించారని మెచ్చుకున్నారు. విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూ ఇచ్చారు. ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో, సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదని ప్రశంసించారు. తాము ఇలాంటి సినిమాటిక్ అనుభవాన్ని ఇప్పటి వరకు పొందలేదని, దాదాపు 4 గంటల పాటు సినిమా ఆద్యంతం అలరించిందని తెలిపారు. ప్రతి సన్నివేశం భావోద్వేగంతో గుండెలకు హత్తుకునేలా ఉందన్నారు. తాను ఒక్క సెకను కూడా కనురెప్ప కూడా వేయకుండా సినిమా చూశానని కోహ్లి తెలిపాడు. దర్శకుడు ఆదిత్య ధర్‌తోపాటు నటుడు రణవీర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
సంతోషం వ్యక్తం చేసిన ఆదిత్య ధర్..
ఆదిత్య ధర్, రణవీర్ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుందని విరాట్ అన్నాడు. ఆదిత్య ధర్ ఒక జీనియస్ అని కొనియాడారు. నటీనటులందరూ వారి పాత్రల్లో ఒదిగిపోయారని, రణవీర్ ఈ చిత్రంతో కొత్త శిఖరాన్ని చేరుకున్నారని అన్నారు. అద్బుతం అనే పదం కూడా ఈ పరిస్థితిని వివరించడానికి సరిపోదని అన్నారు. ఇక అనుష్క శర్మ స్పందిస్తూ సినిమా కట్టిపడేసేలా ఉందని కొనియాడారు. కాగా కోహ్లి, అనుష్క శర్మ పోస్టులపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందిస్తూ తాను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని, కోహ్లి ప్రశంసలు ఎంతో విలువైనవని అన్నారు. కోహ్లికి తాను వీరాభిమానినని, దేశం గర్వించేలా కోహ్లి మైదానం చేసే పోరాటమే తమకు స్ఫూర్తి అని స్పష్టం చేశారు. తన సినిమాలతో దేశం గర్వపడేలా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపారు. అనుష్క నుంచి ప్రశంసలు రావడంతో తనసై బాధ్యత ఇంకా పెరిగిందని, ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా ధురంధర్ 2పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం విమర్శించడం గమనార్హం.












