
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్, టైటిల్ పోస్టర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి వేగంగా కొనసాగుతున్నాయి. స్టార్ సినిమాలకు అత్యంత అనుకూలంగా భావించే దసరా సీజన్ ను లక్ష్యంగా పెట్టుకుని విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత బిగ్ టికెట్ చిత్రాలకు దసరా రెండో అతిపెద్ద పండుగ సీజన్ కావడంతో, అదే స్లాట్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైమ్‌లైన్‌ను అందుకోవడానికి ప్రభాస్ భారీ డేట్స్ కేటాయించి షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారని వినికిడి.
దర్శకుడు హను-రాఘవపూడి ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఓ భయంకరమైన యోధుడిగా మలుస్తున్నారు. అర్జునుడి నిశితత్వం, కర్ణుడి వీరత్వం, ఏకలవ్యుడి అంకితభావం.. అన్నీ కలిసిన పాత్రగా ప్రభాస్ క్యారెక్టర్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే పోస్టర్‌లో కనిపించిన ప్రభాస్ రా అండ్ ఇంటెన్స్ లుక్, పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతోందో స్పష్టమైన సంకేతం ఇచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఫౌజీ ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.








