
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఆమె న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బాడీ షేమింగ్ వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నటుడు అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తన జీవితంలో కీలక మలుపుగా మారిందని అన్నారు. తాను అక్షయ్ ని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. ఎవరికి వారు తమకు తాముగా తమను యాక్సెప్ట్ చేయాలని, వ్యక్తిగత అంగీకారం చాలా ముఖ్యమని అక్షయ్ చెప్పిన మాటలు తనకు ఎంతో సంతోషంగా అనిపించాయని మృణాల్ అన్నారు. తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ట్రోల్స్‌తోపాటు తన వ్యక్తిగత అనుభవాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
శరీరాకృతిపై ట్రోల్ చేసేవారు: మృణాల్
ఒకప్పుడు తన శరీరాకృతిపై చాలా మంది ట్రోల్ చేసేవారన్న విషయాన్ని మృణాల్ ఠాకూర్ గుర్తు చేసుకున్నారు. కొందరు తనను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు కూడా పెట్టేవారని విచారం వ్యక్తం చేశారు. ఆ విమర్శలు, ట్రోలింగ్ తనపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని అన్నారు. దీంతో తన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బ తిందని తెలిపారు. అయితే అదే సమయంలో అక్షయ్ కుమార్ లాంటి వారు ఇచ్చిన సలహాలతో తనను తాను మార్చుకున్నానని, ఆ తరువాత ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. నీ చుట్టూ వినిపించే మాటలను నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చిన విధంగా ముందుకు సాగు.. అని అక్షయ్ తనతో అన్నారని, అవే మాటలు తన జీవితాన్ని మలుపు తిప్పాయని తెలిపారు.
చాలా ధైర్యం కావాలి..
ఒకప్పుడు తనపై వచ్చిన ట్రోలింగ్ కారణంగా ఒక్కోసారి ఏడుస్తూ నిద్రించే దాన్నని మృణాల్ తెలిపారు. ఉదయం కళ్ల వాపులను చూసి తనకు తానే సర్ది చెప్పుకునే దాన్నని వివరించారు. ట్రోల్స్‌ను అధిగమించి ముందుకు సాగడానికి తనకు చాలా ధైర్యం కావల్సి వచ్చిందన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్లంతా తనను ప్రోత్సహించలేదని, జిమ్‌కు వెళ్లినప్పుడు తన శరీరం పదిలో నాలుగు మార్కుల్లా అనిపించేదని తెలిపారు. కానీ ఓసారి ఓ యువతి తన దగ్గరకు వచ్చి తనలాగే ఆమెకు కూడా శరీరం కావాలని అడిగిందని చెప్పారు. ఆమె దృష్టిలో అప్పుడు తనకు పదికి పది మార్కులు వచ్చినట్లు ఫీలయ్యానని తెలిపారు. అప్పుడు తన రూపంతో తాను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నానని ఆలోచించానని తెలిపారు. ఎవరైనా తమకు తాముగా విలువైన వ్యక్తులుగా భావించాలని, అప్పుడు ఇతరులు కూడా విలువ ఇస్తారని తనకు అర్థమైందని తెలిపారు.
ఎవరి శరీరాన్ని వారు ప్రేమించాలి..
భారతీయ మహిళలు సహజంగా కర్వీగా ఉంటారు. నా ఎముకల నిర్మాణం ఎలా ఉందో అది మారదు. నేను చేయగలిగేది నన్ను నేను అంగీకరించుకోవడమే. మన శరీరంతో సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అంగీకారం అత్యంత కీలకం. నేను నా శరీరాన్ని అంగీకరించిన రోజునుంచే, ప్రజలు కూడా దానిని ప్రేమించడం ప్రారంభించారు.. అని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే చిత్రంతోపాటు డెకాయిట్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే పూజా మేరీ జాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌తో కలిసి ఓ సినిమాలో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.












