
హైదరాబాద్‌లో జనవరి 25న జరిగిన తన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థే లేదు అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వెంటనే స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన తొలి ప్రముఖులలో చిన్మయి ఒకరు. తన పోస్టులో ఆమె స్పష్టంగా, క్యాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలో విస్తృతంగా ఉంది. మహిళలు ఫుల్ కమిట్‌మెంట్ ఇవ్వకపోతే పాత్రలు ఇవ్వడం లేదని నేరుగా చెప్పేస్తారు. అయితే సినీ పరిశ్రమలో ఈ పదానికి వృత్తిపరమైన అర్థం ఉండదు, దాని అర్థం పూర్తిగా వేరే, అని రాసుకొచ్చారు.
చిరంజీవిని గౌరవిస్తూనే..
అదే సమయంలో చిరంజీవిపై వ్యక్తిగతంగా గౌరవం వ్యక్తం చేస్తూ, లెజెండరీ చిరంజీవి ఓ ప్రత్యేకమైన తరానికి చెందిన వారు. ఆ తరం నటీనటులు తమ మహిళా సహనటులతో స్నేహితుల్లా, కుటుంబ మిత్రుల్లా ఉండేవారు. పరస్పర గౌరవంతో కలిసి పనిచేశారు. ఆయన గొప్ప లెజెండ్స్‌తో పని చేశారు, తానూ లెజెండ్ అయ్యారు, అని పేర్కొన్నారు. చిరంజీవి సినీ పరిశ్రమ అద్దంలాంటిది, మనం ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తుంది అని అన్న వ్యాఖ్యపై కూడా చిన్మయి స్పందించారు. ఇప్పటి అమ్మాయిలు విదేశాల నుంచి, విస్తృత దృక్పథంతో, మంచి చదువుతో, ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను అర్థం చేసుకుని పరిశ్రమలోకి వస్తున్నారు. కాబట్టి, కాదు, పరిశ్రమ మీరు ఎలా ఉన్నారో ప్రతిబింబించే అద్దం కాదు, అని ఆమె స్పష్టం చేశారు.
వైరముత్తు విషయంపై..
తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చిన్మయి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. వైరముత్తు నన్ను వేధించాడు కాబట్టి కాదు నేను అడిగింది, అప్పటికి నేను ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన అమ్మాయిని. ఆయనను గురువులా, గొప్ప గీత రచయితగా గౌరవించాను. ఆయన ప్రమాదకరమైన పెద్ద మనిషి అని ఎప్పుడూ అనుకోలేదు. నా తల్లి కూడా అదే ప్రాంగణంలో ఉన్నారు, అయినా ఆయన నన్ను వేధించాడు, అని రాశారు. 2018లో భారతదేశంలో మొదలైన మీటూ ఉద్యమ సమయంలో, 2005లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ సంగీత కచేరీలో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని చిన్మయి బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె రాధారవి పేరును ప్రస్తావించిన మహిళలకు మద్దతుగా నిలవడంతో, దక్షిణ భారత సినీ-టీవీ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ (SICTADAU) నుంచి ఆమెను తొలగించారు.
Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ – a word that means completely different in the film industry.
If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…
— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026
ఇండస్ట్రీ అద్దం లాంటిది: చిరంజీవి
కాగా, తాజాగా సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏమీలేదు. ఇది వ్యక్తి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రొఫెషనల్‌గా ఉంటే, ఎదుటివారు కూడా అలాగే ఉంటారు. అనవసరమైన అనుమానాలు పెట్టుకోకూడదు, అని అన్నారు. అలాగే, ఈ పరిశ్రమ అద్దంలాంటిది. మీరు ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. ధైర్యంగా, సంకల్పంతో, కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్లకు ఇది అద్భుతమైన పరిశ్రమ. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందరూ ఇక్కడ ఎదగవచ్చు, అని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ, ఎవరైనా ఇక్కడ ఎదగలేకపోయామని, చేదు అనుభవాలు ఎదురయ్యాయని అంటే, దానికి కారణం వాళ్లే కావచ్చు. మీరు క్రమశిక్షణగా, గట్టిగా ఉంటే ఎవరూ మీ మీద చేయి వేసే ధైర్యం చేయరు, అని అన్నారు.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12, 2026న విడుదల కాగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు. చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయి స్పందనతో ఇప్పుడు సినీ పరిశ్రమలో మహిళల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ వాస్తవాలు, శక్తి సమీకరణాలు వంటి అంశాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చాయి.








