
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అవడంపై దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ జన నాయకన్ చిత్రం లీక్ కావడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సినిమా అనేది విశ్వాసం, కృషి , అనేకమంది కలల సమాహారం అని, ఇటువంటి సంఘటనలు పరిశ్రమ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు. మన సృజనాత్మక కృషిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయని, ఈ చిత్ర బృందానికి తన మద్దతు ఉందని, పైరసీని అరికట్టాలని, సినిమాను కాపాడాలని పేర్కొన్నారు. నటుడు శివకార్తికేయన్ కూడా స్పందిస్తూ ప్రతి సినిమా వందలాది మంది కృషి, రక్తం, చెమటతో తయారవుతుందని అన్నారు. దయచేసి పైరసీని నివారించాలని, థియేటర్‌లో విడుదలయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతిభను, కష్టాన్ని గౌరవించాలని అన్నారు. అలాగే జీవీ ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోనీ, సీబీ సత్యరాజ్, శాంతను భాగ్యరాజ్ వంటి పలువురు నటులు కూడా ఈ ఘటనపై స్పందించారు.
చట్టబద్ధంగా సినిమాను చూడండి..
సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ పైరసీని ప్రోత్సహించవద్దని, ఈ రంగంలో ఎంతో కష్టం, శ్రమ ఉందని అన్నారు. ఇది బాధాకరమైన విషయం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ జన నాయకన్ పైరసీ కారణంగా ప్రభావితమవడం బాధాకరమన్నారు. విడుదల సమయంలో చట్టబద్ధమైన మార్గాల ద్వారా సినిమాను ఆదరించాలని కోరుతున్నానని అన్నారు. నటుడు సీబీ సత్యరాజ్ మాట్లాడుతూ ఈ ఫుటేజ్ లీక్ విషయం విని షాక్‌కు గురయ్యానని అన్నారు. సినిమా తయారీలో ఎంత కష్టం ఉంటుందో గుర్తించాలని, ఆ వీడియోలను చూడవద్దని, షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
పైరసీతో సినిమా ఇండస్ట్రీ నాశనం..
నటుడు శాంతను భాగ్యరాజ్ ఈ ఘటనపై మాట్లాడుతూ ఎవరో ఒకరి కల ఆన్‌లైన్‌లో రక్తస్రావం అవుతోందని, వారి కష్టాన్ని ఫార్వార్డ్ క్లిప్‌గా మార్చవద్దని అన్నారు. సినిమా థియేటర్‌లోనే జీవించాలని, ఫోన్‌లో కాదని అన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ జన నాయకన్ ఫుటేజ్ లీక్ కావడం షాకింగ్ అని అన్నారు. పైరసీ ఒక నేరమని, ఇది సినిమాను పూర్తిగా నాశనం చేయడానికి దారితీస్తుందని హెచ్చరించారు. నటుడు జీవా స్పందిస్తూ తలపతి విజయ్ సినిమా చుట్టూ జరుగుతున్న పైరసీ సమస్య బాధాకరమని తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయవద్దని, పైరసీకి మద్దతు ఇస్తే అభిమానిగా కాదు, సమస్యలో భాగమవుతారని అన్నారు. థియేటర్‌లో విడుదలయ్యే వరకు వేచి ఉండాలని, ఇది కేవలం కంటెంట్ కాదని, సంవత్సరాల కృషి ఫలితం అని పేర్కొన్నారు.
ఎక్కడి నుంచి లీకైంది..?
కాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం లీక్ అయిన వీడియోలో సినిమా టైటిల్ క్రెడిట్స్, విజయ్ పరిచయ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అభిమానులు సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. వీడియో చివర్లో ఒక వ్యక్తి పాజ్ చేస్తున్నట్లు కనిపించడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఈ లీక్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలలో ఆలస్యం ఎదుర్కొంది. జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ అది జరగలేదు. కెనడాకు చెందిన యార్క్ సినిమాస్ సంస్థ ఈ చిత్రం ఏప్రిల్ 30కి ముందు విడుదల అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసి అడ్వాన్స్ టికెట్లను రద్దు చేసింది.
ఆలస్యమవుతున్న సెన్సార్ సర్టిఫికేషన్..
ఈ తమిళ చిత్రం రాజకీయ అంశాలను కలిగి ఉండటంతో సెన్సార్ బోర్డు దీనిని ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు సమాచారం. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 15 నుంచి అమలులోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుండగా ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. చిత్ర సర్టిఫికేషన్ ఆలస్యంపై ఇటీవల విజయ్ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్లు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రంగా జన నాయకన్ రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్. వినోద్ కాగా పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు ముఖ్య పాత్రల్లో నటించారు.












