
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ను స్వయంగా నటుడు సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను మార్చినట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త టైటిల్‌తో మూవీ పోస్టర్‌ను మళ్లీ ఆయన రిలీజ్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ టైటిల్‌ను మాతృభూమిగా మార్చినట్లు తెలిపారు. ఇటీవల కొన్ని చిత్రాలకు టైటిల్స్ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఈ మూవీకి కూడా టైటిల్ వివాదం ఏర్పడింది. అయితే దీనిపై మన దేశంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ, చైనా మీడియా ఆరోపణల నేపథ్యంలోనే టైటిల్‌ను చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా, చిత్రాంగద సింగ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే మాతృభూమి సినిమా పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
View this post on Instagram
చైనా మీడియా ఆరోపణల వల్లే..?
రిలీజ్ కు ముందు ఇటీవల చాలా సినిమాల పేర్లు మారుతున్నాయి. సెన్సార్ సమస్యలతోపాటు పలు వివాదాల కారణంగా సినిమా టైటిల్స్‌ను తప్పక మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇదే జాబితాలో సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ కూడా చేరింది. ఈ సినిమా టైటిల్‌ను మాతృభూమిగా మార్చి సల్మాన్‌ఖాన్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పోస్టర్లో సల్మాన్ యాక్షన్ లుక్‌లో కనిపించారు. ఆర్మీ డ్రెస్‌లో శత్రువుల దాడిని ఎదుర్కొంటున్నట్లుగా సల్మాన్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ మార్పుకు సెన్సార్ సమస్యలు కారణం కావని తెలిసింది. చైనా మీడియా చేసిన ఆరోపణల వల్లే ఈ సినిమా టైటిల్‌ను మార్చినట్లు సమాచారం. ఆ ఆరోపణల వల్లే టైటిల్‌ను మార్చాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
చరిత్రను వక్రీకరిస్తున్నారన్న చైనా మీడియా..
2020లో భారత్-చైనా మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. చైనా సైనికులను భారత సైనికులు ఎలా ఎదిరించారో తెలిపే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారత సైనికులు కొనసాగించిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని ఈ సినిమాలో దర్శకుడు అపూర్వ లఖియా చూపించనున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సినిమా టీజర్‌పై చైనా మీడియా విమర్శలు చేసింది. చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించింది. యాంటీ చైనా లక్ష్యంతోనే సల్మాన్ ఈ మూవీ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో కథనాలు వచ్చాయి. గాల్వన్ లోయలో జరిగింది వేరని, కల్పితాలను ఈ సినిమా ద్వారా వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ఆ ఆరోపణల వల్లే సినిమా టైటిల్‌ను మేకర్స్ మార్చారని తెలుస్తోంది.
రిలీజ్ తేదీ కూడా వాయిదా..?
గతేడాది రిలీజ్ అయిన బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టీజర్‌ను వాస్తవానికి చాలా మంది భారతీయ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం గమనార్హం. టీజర్‌లోని పలు యాక్షన్ సన్నివేశాలు, సల్మాన్‌ఖాన్ క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేవని చాలా మంది సినీ ప్రేక్షకులు విమర్శలు చేశారు. ఎలాంటి ఎమోషన్స్, దేశభక్తి లేకుండా సినిమా చాలా కృతకంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ విమర్శలపై సల్మాన్ రియాక్ట్ అయి స్పందించారు. తాను సినిమాలో ఆర్మీ ఆఫీసర్ కాబట్టి సెటిల్డ్‌గానే కనిపించాలంటూ సమర్థించుకున్నారు. ఇక ఈ సినిమాను గాల్వన్ దాడుల్లో మృతి చెందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అంతకు ముందు ఏప్రిల్ 10, 2026న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ టైటిల్ మార్చిన కారణంగా ఈ సినిమా విడుదలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది. ఆగస్టు 14న సినిమాను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టత రావల్సి ఉంది.












