విడాకుల గురించి వద్దు.. మహిళల కోసం విజయ్ 12 వరాలు! ఎన్నికల వేళ సంచలనం.

త‌న విడాకుల విష‌యం గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప్ర‌జ‌ల సంక్షేమంపై దృష్టి పెడ‌దామ‌ని న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం (టీవీకే) చీఫ్ విజ‌య్ అన్నారు.

March 7, 2026 10:29 PM
Actor Vijay TVK party election promises for women 2026.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా విజయ్ కీలక ప్రకటన. Photo Credit: TVK Party/X.

త‌న విడాకుల విష‌యం గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప్ర‌జ‌ల సంక్షేమంపై దృష్టి పెడ‌దామ‌ని న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం (టీవీకే) చీఫ్ విజ‌య్ అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు గాను 12 ఎన్నిక‌ల హామీల‌ను ప్ర‌క‌టించారు. అయితే ఈ హామీలు కేవ‌లం శాంపిల్ మాత్ర‌మేన‌ని, రానున్న రోజుల్లో మ‌రిన్ని ప‌థ‌కాల‌ను, హామీల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతారో ఆయ‌న వివ‌రించారు. అలాగే ఇటీవ‌లి కాలంలో చోటు చేసుకున్న విడాకుల ప‌రిణామాల‌పై కూడా విజ‌య్ స్పందించారు.

నెల‌కు రూ.2500 న‌గ‌దు, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు, బంగారం..

త‌మిళ‌నాడులో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 చొప్పున న‌గ‌దు స‌హాయం అంద‌జేస్తామ‌ని, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కాకుండా ఇత‌ర మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తామ‌ని విజ‌య్‌ తెలిపారు. అన్న‌పూర్ణి సూప‌ర్ 6 స్కీమ్ కింద పేద కుటుంబాల‌కు ఏడాదికి 6 ఉచిత ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను అందిస్తామ‌ని, అన్న‌న్ సీర్ స్కీమ్ కింద పెళ్లి చేసుకోబోయే మ‌హిళ‌ల‌కు నాణ్య‌మైన ప‌ట్టుచీర‌, 8 గ్రాముల బంగారాన్ని అందిస్తామ‌ని తెలిపారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి కె.కామ‌రాజ్ పేరిట కామ‌రాజ‌ర్ ఎడ్యుకేష‌న్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని, దాని కింద పేద విద్యార్థుల త‌ల్లుల‌కు ఏటా ఒక్కొక్క‌రికి రూ.15వేల చొప్పున ఆర్థిక స‌హాయం అందజేస్తామని, దీంతో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో డ్రాప‌వుట్స్ త‌గ్గుతాయ‌ని అన్నారు.

అన్ని బ‌స్సుల్లోనూ మ‌హిళ‌ల‌కు ఫ్రీ ప్ర‌యాణం..

త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు అన్ని ప్ర‌భుత్వ బ‌స్సుల్లోనూ ఉచితంగా ప్ర‌యాణ సౌకర్యాన్ని క‌ల్పిస్తామ‌ని, ప్ర‌స్తుతం కేవ‌లం కొన్ని మార్గాల్లోనే ఈ స‌దుపాయం అందుబాటులో ఉంద‌ని విజ‌య్ తెలిపారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఒక‌ప్ప‌టి రాణి వేలు న‌చియార్ పేరిట రాణి వేలు న‌చియార్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామ‌ని, అందులో భాగంగా 500 టీమ్‌ల‌ను నియ‌మిస్తామ‌ని, సిబ్బందికి ప్ర‌త్యేకంగా బాడీ కెమెరాల‌ను అమర్చి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను ట్రాక్ చేస్తామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాల‌ను త్వ‌ర‌గా విచారించేందుకు గాను ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, స‌త్వ‌ర న్యాయం అందేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల్లో స్మార్ట్ పానిక్ బ‌ట‌న్‌ల‌ను ఏర్పాటు చేసేలా చూస్తామ‌ని, ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో బాధితుల వ‌ద్ద‌కు 5 నిమిషాల్లోనే చేరుకునేలా వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తామ‌ని తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క‌మాండ్ సెంట‌ర్ల ద్వారా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ను అనునిత్యం ప‌ర్యవేక్షిస్తామ‌ని పేర్కొన్నారు.

విడాకుల‌పై మాట్లాడిన విజ‌య్‌..

గ‌ర్భిణీల‌కు కూడా విజ‌య్ ఓ ప‌థ‌కాన్ని అందిస్తామ‌ని తెలిపారు. ప్ర‌స‌వించిన మ‌హిళ‌ల శిశువుల‌కు బంగారు ఉంగ‌రంతోపాటు ఓ వెల్కం కిట్‌ను ఇస్తామ‌ని, అందులో ప్రోటీన్ పౌడ‌ర్‌, బేబీ సోప్‌, బేబీ ఆయిల్‌, దోమ‌ల నెట్స్‌, డైపర్లు ఉంటాయ‌ని విజ‌య్ తెలిపారు. త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్ర‌భుత్వంపై కూడా విజ‌య్ విమ‌ర్శ‌లు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్‌, మంత్రులు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల్లో సీఎం 20 శాతం క‌మిష‌న్ తీసుకుంటున్నారని, మంత్రుల‌కు 10 శాతం క‌మిష‌న్ వెళ్తుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. అలాగే త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై కూడా మాట్లాడిన విజయ్ త‌న విడాకుల గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు అలా కొన‌సాగుతుంటాయి, వాటి గురించి దిగులు చెందాల్సిన ప‌నిలేదు, ఇప్పుడు మ‌న ఫోక‌స్ అంతా రాష్ట్రంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే ఉండాలి, నేను నా వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోగ‌ల‌ను.. అని విజ‌య్ అన్నారు. అయితే విజ‌య్ ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌కు త‌మిళ ఓట‌ర్లు మొగ్గు చూపుతారా.. లేదా.. అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment