
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్‌కు కూడా ఓ టిక్కెట్‌ను తానే కొనుగోలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో లోకేష్ మాట్లాడుతూ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఒక వేళ ఫైనల్‌కు వెళితే కచ్చితంగా స్టేడియంలోనే మ్యాచ్‌ను చూస్తానని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, తనకు దేశభక్తి కూడా ఎక్కువేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆ మ్యాచ్ చూడాలని అనిపిస్తే తాను వ్యక్తిగతంగా మ్యాచ్‌కు ఓ టిక్కెట్‌ను స్వయంగా కొని అందజేస్తానని తెలిపారు. ఇటీవల లోకేష్ భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు శ్రీలంకలోని కొలంబోకు వెళ్లగా ఆయన పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ మళ్లీ ఈ విషయంపై మాట్లాడారు.
స్పష్టత ఇచ్చిన మంత్రి లోకేష్..
మంత్రి నారా లోకేష్ కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించిన భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం రాత్రికి రాత్రే మళ్లీ అమరావతి చేరుకున్నారు. తరువాత ఫిబ్రవరి 16వ తేదీన అమరావతికి వచ్చిన మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌ను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం మళ్లీ రాత్రికి రాత్రే ఢిల్లీలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే కొలంబోలో మ్యాచ్‌ను వీక్షించేందుకు లోకేష్ ప్రజాధనాన్ని వృథా చేసి వెళ్లారని, ప్రజల డబ్బును లోకేష్ తన విలాసాలకు ఖర్చు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో లోకేష్ ఆ విషయంపై తన ఎక్స్ ఖాతాలో స్పష్టతను ఇచ్చారు. కొలంబోకు తన ఖర్చులతోనే వెళ్లానని, ప్రజాధనాన్ని వృథా చేయలేదని తెలిపారు. అయితే మరోసారి లోకేష్ ఈ విషయంపై మాట్లాడడంతో దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.













