
మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నాగబంధం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. పురాణ గాథలు, చరిత్ర, ఆధ్యాత్మిక తీవ్రతను మేళవించిన కథనంతో ఈ సినిమా గొప్ప నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది.
హిమాలయాల నేపథ్యం..
హిమాలయాల ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వేదికగా చేసుకుని సాగే ఈ కథలో శతాబ్దాలుగా రహస్యంగా కాపాడబడుతున్న ఓ విశ్వశక్తి ప్రధానాంశంగా నిలుస్తుంది. ఆ శక్తిని లోభం వెలికి తీయాలని ప్రయత్నించినప్పుడు, దాన్ని రక్షించేందుకు విధి ఓ యోధుడిని ఎంచుకుంటుందనే భావన టీజర్‌లో ప్రతిబింబించింది. కథలో భాగంగా అబ్దాలీ నేతృత్వంలో జరిగిన చారిత్రక ఆఫ్ఘన్ దండయాత్రకు స్వల్ప ప్రేరణ తీసుకున్నట్లు సమాచారం. సాంస్కృతిక ప్రతిఘటనతోపాటు దైవ రక్షణ భావనను కలిపి కథను నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథకు కేంద్ర బిందువుగా నిలిచేది పవిత్రమైన నాగబంధం ఆలయం. ఈ ఆలయం ప్రాచీన విశ్వశక్తిని కాపాడుతోందనే నమ్మకమే కథకు ప్రాణం. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా, అద్భుతమైన విజువల్స్, హైఎండ్ వీఎఫ్‌ఎక్స్‌తో ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపించింది.
ఆకట్టుకుంటున్న శివుడి లుక్..
విరాట్ కర్ణ ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన, ఉగ్రరూపంలో కనిపించాడు. ముఖ్యంగా శివుడి అవతారాన్ని తలపించే లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతడి శారీరక మార్పు, తెరపై కనిపించే పవర్ ఈ పాత్ర ఎంత కీలకమైందో చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్, ఇష్వర్య మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బలమైన తారాగణం, ఆధ్యాత్మిక నేపథ్యం, పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న విజన్‌తో నాగబంధం ఇప్పటికే అత్యంత ఆసక్తికరమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. భారీ విజువల్స్, పురాణ వైభవం, ఆధ్యాత్మిక మర్మాలతో నాగబంధం ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినీ అనుభూతిని అందించబోతుందనే అంచనాలు టీజర్‌తో మరింత బలపడ్డాయి.








