
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. 2026లో సెట్స్‌పైకి వెళ్లే ఆయన తొలి సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డితో తెరకెక్కనుంది. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా, కథను వక్కంతం వంశీ అందిస్తున్నారు.
పూజా కార్యక్రమం వచ్చే నెలలో..?
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్‌ను ముందుగానే కేటాయించినట్లు సమాచారం. రాజకీయ బాధ్యతల మధ్య కూడా ప్రతి నెల కొంత సమయం కేటాయించి, షూటింగ్ నిరాటంకంగా సాగేలా ప్రణాళిక రూపొందించారు.
నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రాజకీయ కార్యక్రమాల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌ను వేగంగా ముగించాలనే ఆలోచనలో టీమ్ ఉంది.
కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సంబంధిత కార్యక్రమాల్లో మరింత చురుగ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.








