
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2024లో విడుదలైన దేవర: పార్ట్ 1 మిశ్రమ స్పందన పొందడంతో సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? లేక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మొదటి భాగం కథను ఓపెన్ ఎండ్‌తో ముగించడంతో కొనసాగింపు ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డప్పటికీ, అధికారిక ప్రకటనలు లేకపోవడం ఈ సందేహాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది మే నెలలో దేవర పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తాం. 2027లో సినిమాను విడుదల చేయాలన్నది మా ప్రణాళిక. ఈ చిత్రం కూడా కచ్చితంగా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని తెలిపారు.
దేవర: పార్ట్ 1 పై మిశ్రమ స్పందన..
నిర్మాత వ్యాఖ్యలతో అభిమానుల్లో కొంత ఊరట కలిగినప్పటికీ, కొందరు మాత్రం ఇంకా అనుమానంగానే ఉన్నారు. ఒక అభిమాని సోషల్ మీడియాలో 2028 అనుకుందాం ఇక రిలీజ్ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. దేవర: పార్ట్ 1లో సముద్ర దొంగగా మొదలై ప్రజల రక్షకుడిగా మారే దేవర పాత్రతో పాటు, అతని కుమారుడు వర పాత్రలను కూడా జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో పోషించారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించగా, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి నటులు సహాయక పాత్రల్లో కనిపించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.428 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పార్ట్ 2పై అధికారిక ప్రకటన..
మొదటి భాగం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా దేవర: పార్ట్ 2ను అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో కథను మరింత విస్తృతంగా, ఎమోషనల్, యాక్షన్ అంశాలతో ముందుకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇక దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2లో హృతిక్ రోషన్, కియారా అద్వానీతో కలిసి నటించారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు కావచ్చని ప్రచారం జరుగుతుండగా, ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దేవర: పార్ట్ 2పై నిర్మాత తాజా ప్రకటనతో అనుమానాలకు కొంతమేర తెరపడినప్పటికీ, షూటింగ్ మొదలయ్యే వరకు, అధికారిక అప్‌డేట్స్ వచ్చే వరకు అభిమానుల ఉత్కంఠ కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.








