
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికాలో జరగనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పటి నుంచో అత్యంత ప్రాధాన్యమున్న ట్రోఫీ అని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ తో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ తాను తప్పకుండా ఆ వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నానని, తన దేశం కోసం ఆ ట్రోఫీని గెలవాలనే ఆశ ఎప్పుడూ ఉందని అన్నారు. చిన్నప్పుడు తాము చూసింది 50 ఓవర్ల వరల్డ్ కప్ మాత్రమే అని, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ లేవని అన్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఆ టోర్నీనే క్రికెట్‌లో అత్యంత ముఖ్యమని, ఆ ట్రోఫీ కోసం తన శక్తి మేరకు కష్టపడతానని తెలిపారు.
2023 ఓటమి అనంతరం నిరాశ..
రోహిత్ ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చివరిసారిగా ఆయన ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తరఫున ఆడారు. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో గెలుచుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ నాయకత్వంలో భారత్ లీగ్ దశలో అజేయంగా నిలిచింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ నిరాశ తరువాత భారత్ ఐసీసీ టోర్నీల్లో విజయాలు సాధించింది. 2024లో టీ20 వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికాపై ఫైనల్లో గెలుచుకుంది. ఆ తరువాత దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ సొంతం చేసుకుంది.
రోహిత్ కెప్టెన్సీ తరువాత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచే గిల్ బాధ్యతలు చేపట్టాడు. అయితే కెప్టెన్సీ మారినా 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆటగాడిగా ట్రోఫీ గెలవాలనే పట్టుదల రోహిత్ శర్మలో స్పష్టంగా కనిపిస్తోందని అర్థమవుతోంది. మరి ఆయన అప్పటి వరకు ఫామ్ లో ఉంటాడా, అది జరిగినా ఆయన అప్పటికి వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.







