
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వరకు జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. సోమవారం (మార్చి 2, 2026) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై ఈ సీజన్ తేదీలను ఖరారు చేయనుందని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్‌పై క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఈ సారి ఐపీఎల్ ఆలస్యం వెనుక పలు కారణాలు ఉన్నట్లు అర్థమవుతోంది.
కారణాలు ఇవే..?
అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు, ప్లేయర్లకు, ఇతర సిబ్బందికి సెక్యూరిటీ కల్పించడం కష్టంగా మారుతుంది. కనుక ఎన్నికలు జరిగే తేదీలను మినహాయించి మిగిలిన రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఆయా శాసనసభలకు ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. దీంతో ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై కూడా సందిగ్ధత నెలకొంది. అందుకనే ఈసారి ఐపీఎల్ ఆలస్యంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతాలలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు ఉన్నాయి. కానీ ఐపీఎల్‌కు సిద్ధం అవ్వాలంటే ఆ స్టేడియంలు ఇప్పటికే ఖాళీగా ఉండాలి. టీ20 వరల్డ్ కప్ కారణంగా ఇప్పుడు స్టేడియంలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. కాస్త సమయం పడుతుంది. కనుక ఈ కారణంగా కూడా ఐపీఎల్ 2026ను ఈసారి ఆలస్యంగా నిర్వహిస్తారని తెలుస్తోంది.
సిద్ధం కాని ఆర్‌సీబీ స్టేడియం..?
అయితే గతేడాది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య ఫైనల్ జరగ్గా అందులో ఆర్‌బీసీ జట్టు విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఈసారి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఆర్‌సీబీ సొంత మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కూడా భద్రతా పరమైన ప్రమాణాలు, సెక్యూరిటీ పెంపు వంటి మరమ్మత్తు పనులు చేస్తున్నారు. కనుక ఆ మైదానం కూడా ఇంకా సిద్ధం కావల్సి ఉంది. ఇలా అన్ని అంశాలు కలసి ఈసారి ఐపీఎల్ ఆలస్యం అయ్యేందుకు కారణం అవుతున్నాయి. అయితే వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గనక జరిగితే ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.












