
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ సెల్ (SMIT) పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు పలు విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో కలిసి డేటా అనాలిసిస్, పరిశోధన, నేర ధోరణుల విశ్లేషణ వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఆధారిత యుగంలో పోలీసులు సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు, ఎలా విశ్లేషిస్తున్నారు, నేర నిరోధక వ్యూహాలను ఎలా రూపొందిస్తున్నారు వంటి అంశాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో డిజిటల్ సెక్యూరిటీపై కూడా అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.
పోలీసింగ్ విధానాలపై అవగాహనకు..
ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అనేక అంశాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా పోలీసులు కూడా ఆ రంగంపై ఆధార పడి నేరాల నియంత్రణ, విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆధునిక పోలీసింగ్ విధానాలపై విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా అనేక విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆయా విధులను ఎలా నిర్వర్తిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి విషయ పరిజ్ఞానం పెంచుకోవచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను కూడా అందించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దీని వల్ల విద్యార్థుల అకాడమిక్ ప్రొఫైల్ మరింత బలోపేతం అవుతుందని, పౌర పరిపాలన, పట్టణ భద్రత రంగాల్లో ప్రాయోగిక అనుభవంగా కూడా ఈ కార్యక్రమం పనిచేస్తుందని చెప్పారు.
యువతను పాలనలో భాగస్వాములను చేయడం, సమాజంలో పోలీసింగ్ వ్యవస్థపై అవగాహనను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పోలీసు అధికారులు తెలిపారు. విద్యార్థుల భాగస్వామ్యం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, మెట్రోపాలిటన్ నగరాల్లో పోలీసింగ్ ఎలా పనిచేస్తుందో సమగ్ర అవగాహన ఏర్పడుతుందని తెలిపారు.
ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ఇలా దరఖాస్తు చేయాలి.
- అభ్యర్థులు ముందుగా https://www.hyderabadpolice.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో ఉండే Internship Programme అనే విభాగాన్ని ఎంచుకోవాలి.
- అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవాలి.
- విద్యార్హత పత్రాలు, గుర్తింపు ఆధారాలను సిద్ధం చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను పూర్తిగా పూరించాలి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- సబ్‌మిట్ చేయడానికి ముందు ఫామ్‌ను మరోసారి పరిశీలించాలి.
- దరఖాస్తును సబ్‌మిట్ చేసి రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.
విద్యార్థుల దరఖాస్తును పోలీసు అధికారులు అంగీకరిస్తే వారికి సమాచారం ఇస్తారు. ఎంపిక, చేరిక వంటి వివరాల కోసం పోలీసు అధికారులను సంప్రదించాలి. లేదా వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
గమనిక: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అప్‌డేట్స్ కోసం ఆ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు సందర్శించాలి.












