
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎస్‌ఈటీ) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం ఆపరేషన్స్, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరగనుంది.
ఖాళీల వివరాలు
ఈ నియామకంలో టెలికాం విభాగం 95 పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తారు. వర్గాల వారీ రిజర్వేషన్ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: జనవరి 29, 2026
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 5, 2026
- దరఖాస్తు చివరి తేదీ: మార్చి 7, 2026
- దరఖాస్తు సవరణ గడువు: మార్చి 8 నుంచి మార్చి 15, 2026 వరకు
- సీబీటీ పరీక్ష (అంచనా): మార్చి 29, 2026
- గడువు దాటిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది.
అర్హతలు, వయోపరిమితి
- టెలికాం విభాగంకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పూర్తి కాల బీఈ లేదా బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ తదితర విభాగాలు అర్హత కలిగినవిగా పరిగణిస్తారు.
- ఫైనాన్స్ విభాగంకు సంబంధించి అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండాలి.
- వయోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వుడ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, వేతన స్కేలు
- అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం పత్రాల పరిశీలన ద్వారా జరుగుతుంది. పరీక్ష విధానం, సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.
- ఎంపికైన వారికి ఈ-3 ఐడీఏ పే స్కేలు కింద రూ.24,900 నుంచి రూ.50,500 వరకు వేతనం లభిస్తుంది. శిక్షణ లేదా ప్రొబేషన్ సమయంలో వేతనాలు, అలవెన్సులు బీఎస్‌ఎన్‌ఎల్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
గమనిక: ప్రభుత్వ రంగ సంస్థలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాన్ని ఆశించే యువతకు ఇది మంచి అవకాశం కావడంతో, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.bsnl.co.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయాలని సూచిస్తున్నారు.








