
ఆధునిక జీవనశైలి వేగవంతంగా మారుతూ ఒకేసారి అలసత్వాన్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా అధికమవుతోంది. రక్తంలో చక్కెర మోతాదు అధికంగా ఉన్నప్పుడు శరీరంలోని కణాలు, కండరాలు ఇన్సులిన్‌కు సముచితంగా స్పందించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది. టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే సరైన జీవనశైలి మార్పులు, ముఖ్యంగా సమతుల్య ఆహారపు అలవాట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంబంధించిన లక్షణాలపై వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, కార్బొహైడ్రేట్లు లేదా చక్కెరలను తినాలని కోరిక ఉండడం, దాహం ఎక్కువగా ఉండటం వంటి సూచనలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పోషకాహారాలను తీసుకోవడం అవసరం..
టైప్-2 డయాబెటిస్‌ను వెనక్కి మళ్లించే మార్గాలపై తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అవగాహన కల్పిస్తున్న పోషకాహార నిపుణురాలు చార్మైన్ హా డొమింగ్వెజ్ ఇటీవల పెట్టిన పోస్టులో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలను ప్రస్తావించారు. సరైన సమయంలో నియంత్రించకపోతే ఈ పరిస్థితి టైప్-2 డయాబెటిస్‌కు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతోపాటు అధిక ఫైబర్ ఉండే ఐదు ముఖ్య ఆహారాలను ఆమె సూచించారు. మొదటగా బ్లాక్ బీన్స్‌ను ఆమె ప్రస్తావించారు. వీటిలో ద్రవీభవించే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని తెలిపారు. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండటంతో గ్లూకోజ్ మెటబాలిజం సమతుల్యం అవుతుందని ఆమె వివరించారు.
View this post on Instagram
ఆకుకూరలు, కినోవా..
తరువాత డార్క్ లీఫీ గ్రీన్స్ గురించి ఆమె మాట్లాడారు. ఆకుకూరలు ఎంత ముదురు రంగులో ఉంటే అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని తెలిపారు. ఇవి కాల్షియాన్ని సమృద్ధిగా అందించడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. కినోవాను ఆమె మరో ముఖ్యమైన ధాన్యంగా సూచించారు. బియ్యం, బ్రెడ్ వంటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కార్బొహైడ్రేట్లు రక్తంలో చక్కెరలను వేగంగా పెంచుతాయని, అందువల్ల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలని సూచించారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో కొలిచే ప్రమాణం. కినోవా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సంపూర్ణ ధాన్యం కావడంతో తెల్ల బియ్యానికి బదులుగా ఉపయోగించవచ్చని, దీన్ని త్వరగా వండుకోవచ్చని ఆమె తెలిపారు.
పీచెస్..
ఫారో అనే పాతకాలపు గోధుమ ధాన్యాన్ని కూడా ఆమె ప్రోత్సహించారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు ప్రత్యేకమైన నమిలే తత్వం ఉందని చెప్పారు. పోషక విలువల పరంగా ఇది ఎంతో బలమైన ఆహారమని పేర్కొన్నారు. చివరిగా పీచెస్‌ను ఆమె సూచించారు. చక్కెరలు ఎక్కువగా ఉండే తీపి పదార్థాలను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు నివారించాలనే సలహా సాధారణంగా ఇస్తారు. అయితే పీచెస్ తీపిగా ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీకి మద్దతు ఇస్తాయని తెలిపారు. ఈ సీజన్లో పీచెస్‌ను ఆహారంలో చేర్చాలని సూచించారు. ఇలా ఈ 5 ఆహారాలను తీసుకుంటే ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరగడంతోపాటు ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నవారు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చని ఆమె తెలిపారు.
గమనిక: ఈ కథనం సమాచారం, వైద్య విజ్ఞానంపై అవగాహన కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే లేదా సలహా కావల్సి వస్తే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.








