
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి అసలు ఎలాంటి లక్షణాలు కూడా లేకుండానే హైబీపీ ఉన్నట్లు బయట పడుతోంది. ఈ క్రమంలోనే హైబీపీ బారిన పడినవారికి గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్ వంటి వ్యాధుల ముప్పు పెరుగతోంది. మాయో క్లినిక్ తెలిపిన ప్రకారం, రక్తనాళాల గోడలపై రక్తం ఎక్కువ పీడనాన్ని కలిగిస్తూ రక్త నాళాల్లో సరఫరా అవుతుంది. దీని వల్ల గుండెపై భారం పడుతుంది. అది మరింత ఎక్కువ శ్రమిస్తూ పనిచేయాల్సి వస్తుంది. సాధారణంగా బీపీ విలువ 130/80 mm Hg కన్నా ఎక్కువగా ఉంటే ఆ స్థితిని హైపర్ సెన్సిటివ్ అంటారు. అయితే బీపీ విలువ 180/120 mm Hg దాటితే అప్పుడు వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది.
కీలక సూచనలు చేసిన డాక్టర్ సుధీర్ కుమార్..
ప్రస్తుతం హైబీపీతో చాలా మంది బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ కుమార్, ఎండీ, పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అందులో ఆయన హైబీపీ రాకుండా ముందుగానే నివారించాలంటే పాటించాల్సిన ఆరోగ్య నియమాలను వివరించారు. జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి ఆయన తెలియజేశారు.
వ్యాయామం చేయడం..
- హైబీపీ రావొద్దని కోరుకునే వారు తమ శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. శారీరకంగా తగినంత ఉత్తేజంగా ఉంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- రోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగవంతమైన నడక లేదా యోగా వంటి వ్యాయామాలను చేయాలని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.
- గోడ కుర్చీ వేయడం, ప్లాంక్ వ్యాయామం వంటివి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయని, గుండె పనితీరును మెరుగు పరిచి హృదయ సంబంధ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయన చెప్పారు.
- అయితే కొందరు ఒకటి రెండు రోజులు వ్యాయామం చేసి ఆపేస్తారు. కానీ అలా చేయకూడదు, రోజూ ఒక ప్రణాళిక ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని, దీని వల్ల ఎల్లప్పుడూ బీపీ సాధారణ స్థాయిలో ఉంటుందని, హైబీపీ రాకుండా నివారించవచ్చని ఆయన తెలిపారు.
ఉప్పు వాడకాన్ని తగ్గించడం..
- హైబీపీ సమస్యకు చాలా మంది తీసుకునే ఆహారం కూడా కారణమవుతుందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని తగ్గించాలని, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర ఉండే పానీయాలను తీసుకోకూడదని ఆయన సూచించారు.
- ఇవన్నీ బీపీని క్రమంగా పెంచుతాయని, ఓ దశలో హైబీపీకి కారణమవుతాయని తెలిపారు. కనుక ఆయా ఆహారాలను మానేసి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు.
- ప్రస్తుతం మెడిటరేనియన్, డాష్ వంటి డైట్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని పాటిస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందని ఆయన చెప్పారు.
- పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, తక్కువ సోడియం ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
ఒత్తిడి నిర్వహణ..
డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపిన విషయాలను మాయో క్లినిక్ కూడా అంగీకరించింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వృక్ష సంబంధ ఆహారాలను, తృణ ధాన్యాలను తినడం వల్ల బీపీని సహజసిద్ధంగా నియంత్రణలో ఉంచుకోవచ్చని, దీని వల్ల హైబీపీ రాకుండా అడ్డుకోవచ్చని, మందులను వాడాల్సిన అవసరం ఉండదని మాయో క్లినిక్ తెలియజేసింది. శారీరక శ్రమ, పోషకాహారం మాత్రమే కాకుండా రోజూ తగినంత విశ్రాంతి కూడా ఉండాలని, కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రించాలని డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, మెడిటేషన్ చేయాలని, గాఢమైన శ్వాస వ్యాయామాలు చేయాలని అన్నారు. తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని, దీని వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కనుక ఆయా అంశాల పట్ల కూడా ప్రాధాన్యత వహించాలని అన్నారు.
తరచూ బీపీ పరీక్షలు..
మాయో క్లినిక్ తెలిపిన ప్రకారం, ఎలాంటి లక్షణాలు లేదా సంకేతాలు లేకపోయినప్పటికీ ప్రతి వ్యక్తి విధిగా బీపీ పరీక్షలను తరచూ చేయించుకోవాల్సి ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి తమకు ఆ వ్యాధి ఉందని చాలా ఏళ్ల వరకు కూడా తెలియదు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేదా సంకేతాలు కనిపించవు. అలాంటి సందర్భాల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే తరచూ బీపీ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని మాయో క్లినిక్ తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు 40 ఏళ్ల వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చొప్పున బీపీ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే 40 ఏళ్లు దాటిన వారికి రిస్క్ ఎక్కువ కనుక వారు కనీసం 6 నెలలకు ఒకసారి అయినా బీపీ పరీక్షలను చేయించుకోవాలని మాయో క్లినిక్ సూచించింది. దీని వల్ల హృద్రోగాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది.
వార్త విశ్లేషణ..
రోజూ వ్యాయామం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర వంటి అంశాలు దీర్ఘకాలంలో హైబీపీ ముప్పును తగ్గిస్తాయి. డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, వ్యాధి వచ్చాక బాధపడుతూ చికిత్స తీసుకోవడం కన్నా, అది రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమమని తేలింది. మన రోజువారి దినచర్యతోపాటు జీవనశైలిలోనూ చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలం పాటు గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని స్పష్టమైంది.
– విశ్లేషణ: బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి సలహా తీసుకోవాలి.









