
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని నటి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఒకప్పుడు నేను నా జీవితంలో ఒక అడుగు కూడా అనుమతి లేకుండా ముందుకు వేయలేనని అనిపించేది. ఎందుకంటే ఒక అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ సక్సెస్ అవ్వడాన్ని కొందరు అంగీకరించరు. కానీ గత 13 ఏళ్లుగా మథియాస్‌తో ఉన్న నా బంధంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడూ నాకు మా బంధంలో ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కలగలేదు.. అని తాప్సీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె తమ కెరీర్, వైవాహిక జీవితం, సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోల్స్‌పై తన అనుభవాలను పంచుకున్నారు.
అందంగా అంగీకరించాలి..
దేశీయ, విదేశీయ పురుషులను ఒకే కోణంలో పోల్చడం సరికాదని తాప్సీ అన్నారు. నేను పెళ్లి చేసుకున్నాననే విషయాన్నే కొన్ని సార్లు మరిచిపోతాను. నేను చెప్పిందే సరైనది అని అంగీకరించే వ్యక్తి కూడా నాకు అవసరం లేదు. అందంగా అంగీకరించే భాగస్వామి నాకు కావాలి. నేను ఓల్డ్ స్కూల్. మొదటి లేదా రెండో డేట్ తర్వాతే స్పష్టత ఉండేది. ఈ బంధం పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉంటేనే ముందుకు సాగాలి, లేకపోతే ఎందుకు ప్రయత్నం? అని భావించేదాన్ని. ఇప్పటివరకు ఎలా ఉందో అలాగే కొనసాగగలిగితేనే పెళ్లి చేసుకుందాం అన్నదే నా నిబంధన.. అని తాప్సీ పేర్కొన్నారు.
వాణిజ్యపరంగా అందుకనే వెళ్లలేదు..
దీర్ఘకాలికంగా ఏది సరిపోతుందో ఇద్దరం చర్చించుకున్నాం. టోర్నమెంట్ల కారణంగా ఆయన జీవితం ఎప్పుడూ ప్రయాణాలతో నిండి ఉంటుంది. విదేశాల్లో నేను కూడా కొంత కాలం ఉన్నా. కానీ శాశ్వతంగా అక్కడే ఉండలేనని అర్థమైంది. అందుకనే ఇద్దరికీ సరిపోయే మార్గాన్ని ఎంచుకున్నాం.. అని తాప్సీ తెలిపారు. నా పెళ్లిని వాణిజ్యపరంగా మలచుకునే అవకాశం వచ్చింది. అయినప్పటికీ వ్యక్తిగతంగా జరుపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చా. రైట్స్ ఇవ్వడం వల్ల డబ్బులు బాగా వచ్చి ఉండేవి. అంతర్జాతీయంగా నెట్ ఫ్లిక్స్‌లోనూ కనిపించవచ్చు. కానీ మేము సంప్రదాయ బద్దంగా, సన్నిహితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకనే వాణిజ్యపర ధోరణికి వెళ్లలేదు.. అని తాప్సీ వివరించారు.
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను, ట్రోల్స్‌ను మేం పట్టించుకోము. కామెంట్లను కూడా చదవము. మేము మా ప్రపంచంలో సంతోషంగా ఉండేందుకే ప్రాధాన్యతను ఇస్తాం.. అని తాప్సీ తెలిపారు. కాగా తాప్సీ, మథియాస్ జంట 2023లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో వో లడ్‌కీ హై కహా, గాంధారి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.












