
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. సహనటీనటులకు ఖరీదైన దుస్తులు బహూకరించడం, ఇంట్లో వండిన భోజనం పంపించడం, సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం వంటి ఎన్నో సందర్భాల్లో ఆయన తన పెద్ద మనసును చాటుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, సినిమా షూటింగ్ పూర్తయిన ప్రతిసారి యూనిట్‌లో పనిచేసిన సాంకేతిక నిపుణులు, సిబ్బందికి విలువైన బహుమతులు అందిస్తూ వారి కష్టానికి గుర్తింపు ఇవ్వడం ప్రభాస్ ప్రత్యేకతగా మారింది. గతంలో ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాల యూనిట్లకు ఖరీదైన చేతి గడియారాలు బహూకరించిన ఆయన, తాజాగా ది రాజా సాబ్ చిత్ర బృందానికి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.
సిబ్బందికి నగదు బహుమతులు..
మూడున్నర సంవత్సరాల పాటు సాగిన ఈ సినిమా ప్రయాణంలో తమతో కలిసి పనిచేసిన ప్రధాన సాంకేతిక విభాగాల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున, గ్రౌండ్ స్టాఫ్‌కు రూ.10,000 చొప్పున నగదు బహుమతులు ప్రభాస్ అందించినట్లు సమాచారం. యూనిట్ సభ్యుల కష్టాన్ని గౌరవిస్తూ చేసిన ఈ చర్యతో ఆయనకు టీమ్‌తో ఉన్న అనుబంధం మరింత బలపడిందని, సెట్స్‌పై ఆయన ఏర్పరచుకున్న నిజమైన మానవ సంబంధాలకు ఇది నిదర్శనమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా, యూనిట్‌పై తన ప్రేమను తగ్గించకుండా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం ప్రభాస్ గొప్పతనంగా అభివర్ణిస్తున్నారు.
లంక సత్యానంద్‌కు ఖరీదైన గోల్డెన్ వాచ్..
ఈ విషయమై ఫిల్మ్‌ఫేర్‌తో మాట్లాడిన ఓ యూనిట్ సభ్యుడు, యూనిట్‌తో తనకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో ప్రభాస్ ఈ విధంగా చూపిస్తారు. దాదాపు అన్ని విభాగాలకు చెందిన సిబ్బందికి బహుమతులు అందాయి. ఇది ఆయన వినయశీలతకు, దయాగుణానికి ప్రతీక, అని తెలిపారు. సలార్ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత కూడా ప్రభాస్ యూనిట్ సభ్యులకు ఇలానే బహుమతులు పంపినట్లు ఆయన గుర్తు చేశారు. ఇటీవల తన నటనా గురువు లంక సత్యానంద్ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన బంగారు గడియారం బహూకరించడం కూడా ఆయన ఉదార స్వభావానికి మరో ఉదాహరణగా నిలిచింది. తనతో పనిచేసే ప్రతి ఒక్కరూ తనకు ఎంత ముఖ్యమో ఈ బహుమతుల ద్వారానే ప్రభాస్ తెలియజేస్తారు, అని ఆ యూనిట్ సభ్యుడు పేర్కొన్నారు.
ఫౌజీ షూటింగ్‌తో బిజీ..
ఇక ప్రభాస్ తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే, యూరప్‌లో విహారయాత్ర ముగించుకుని తిరిగివచ్చిన ప్రభాస్ త్వరలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం సగం వరకు చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2026 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.








