
ఆధార్‌కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 28న ఈ యాప్‌ను ప్రజలందరికీ UIDAI విడుదల చేయడంతో దేశంలోని ప్రతి ఆధార్ కార్డు దారుడు దీని సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం లభించింది. ఆధార్ వివరాలను భద్రపరచడం నుంచి అవసరమైనప్పుడు పంచుకోవడం వరకు, అనేక సేవలను ఇప్పుడు నేరుగా మొబైల్ ఫోన్ నుంచే నిర్వహించవచ్చు. అయితే ఈ యాప్ ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
కొత్త ఆధార్ యాప్ ముఖ్య ఫీచర్లు
- ఒకేసారి ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను భద్రపరచుకునే సౌకర్యం
- మాస్క్ చేసిన ఆధార్‌ను షేర్ చేసే అవకాశం
- ఆధార్ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తక్షణ ధ్రువీకరణ
- మొబైల్ నంబర్, చిరునామా మార్పులను సులభంగా అప్డేట్ చేసే వీలు
- సెలెక్టివ్ షేర్ ఫీచర్ ద్వారా ఏ వివరాలు చూపించాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు
- బయోమెట్రిక్ లాక్ ఫీచర్‌తో అదనపు భద్రత
రిజిస్ట్రేషన్‌కు ముందు చేయాల్సిన సిద్ధత
రిజిస్ట్రేషన్ ప్రారంభించే ముందు కొన్ని విషయాలు గమనించాలి. మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. వేరే నంబర్‌తో రిజిస్ట్రేషన్ సాధ్యమైనా, తర్వాత కొన్ని సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మంచి నెట్వర్క్ ఉన్న ప్రదేశంలోనే రిజిస్ట్రేషన్ చేయడం మంచిది. ఆధార్ కార్డు లేదా దాని డిజిటల్ కాపీ దగ్గర ఉంచుకోవాలి.
కొత్త ఆధార్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసే విధానం
- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డెవలపర్‌గా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పేరు ఉందో లేదో పరిశీలించాలి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన భాషను ఎంచుకుని నిబంధనలు అంగీకరించాలి.
- హోమ్ స్క్రీన్‌పై కనిపించే రిజిస్టర్ ఆధార్ ఎంపికపై ట్యాప్ చేయాలి.
- పన్నెండు అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మొబైల్ ధ్రువీకరణ పూర్తి చేయాలి.
- తదుపరి ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి. ఫ్రంట్ కెమెరా స్పష్టంగా ముఖాన్ని క్యాప్చర్ అయ్యేలా ఫోన్ పట్టుకుని రెండు సార్లు కళ్లుమిటకరించాలి.
- చివరగా ఆరు అంకెల పిన్ సృష్టించాలి. భవిష్యత్తులో యాప్ ఓపెన్ చేయడానికి ఇదే పిన్ అవసరం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
వినియోగదారులకు సూచన
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఆధార్‌కు సంబంధించిన అనేక సేవలు ఇక యాప్ ద్వారానే సులభంగా చేయవచ్చు. కాబట్టి యాప్‌ను సురక్షితంగా ఉపయోగించడంతో పాటు, పిన్ను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా కొత్త ఆధార్ యాప్‌తో ఆధార్ సేవలు డిజిటల్‌గా మరింత వేగంగా, సురక్షితంగా మారాయని చెప్పవచ్చు.








