
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఆమె నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తాజాగా వచ్చిన చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో కొనసాగుతోంది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమాను షానియల్ డియో తెరకెక్కించారు. అయితే సినిమా థియేటర్లలో రన్ అవుతున్న నేపథ్యంలో ఆమె చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
డెకాయిట్ ఒక మంచి ప్రేమ కథ..
మంచి సినిమాలు కావాలంటే కచ్చితంగా ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని సుప్రియ అన్నారు. అదే వాటికి అందం తెస్తుందని, స్వతహాగా తనకు ఎక్కువగా డ్రామా టైప్ సినిమాలు, ప్రేమ కథలు నచ్చుతాయని తెలిపారు. తెలుగులో ఈ కథలు ఈ మధ్య ఎక్కువ రావడం లేదని తనకు అనిపిస్తుందని, అందుకే డెకాయిట్ రూపంలో మంచి ప్రేమ కథను అందించామని తెలిపారు. ఇది మహిళలకు, జెన్‌జీకి కూడా కనెక్ట్ అయిందన్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణ తనకు ఆనందాన్ని ఇస్తుందని, ఈ సినిమాను తాము జాగ్రత్తగా తెరకెక్కించామని తెలిపారు. వృథా ఖర్చులు అసలు చేయలేదని, 10, 15 రోజులు షెడ్యూల్ పెరిగినా కావాలనే తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించామని తెలిపారు. ఇప్పుడు దీనికి హిందీలోనూ మంచి ఆదరణ లభిస్తుందన్నారు. మలయాళంలో పరిమిత థియేటర్లలో విడుదలైనా అక్కడా అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. ఇది ఓటీటీలో 5 భాషల్లో విడుదలవుతుందని తెలిపారు.
కొత్త వారితో పనిచేయడం సవాలే..
తాను ఈ సినిమా తీస్తున్నానని చెప్పగానే చాలా మంది ఇలాంటి కథ ఎందుకని ప్రశ్నించారని, రొటీన్‌గా అనిపించేవి చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటివి తీయడానికి చాలా మంది ఉన్నారని, తన మార్క్ చూపించాలంటే డెకాయిట్ లాంటి చిత్రాలనే తీయాలని, అందుకనే ఆ సినిమా తీశానని తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త వారితో పనిచేయడం సవాల్ గా అనిపించిందని, ఎడిట్ రూమ్‌లో అంతా కొత్త వారిని చూసినప్పుడు మొదట్లో అనుకున్న సమయానికి సినిమాని అందించగలమా, లేదా అని భయపడ్డానని, కానీ తాము అనుకున్న సమయానికే చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. తనకు సినిమా అంటే ప్రేమ అని, తన ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఇష్టమని, ప్రేమ, త్యాగం, ద్రోహం లాంటి ఎమోషన్స్ మన క్లాసిక్ ప్రేమ కథల్లో ఉంటాయని అన్నారు. అలాంటి కథలు కలిగిన సినిమాలను తీయడానికి తాను ఆసక్తిని చూపిస్తానని వెల్లడించారు.












