
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్ అన్నారు. తాను అస్సాం వాసినని, దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న కారణం వల్ల తెలుగు, తమిళం, మలయాళం భాషలను నేర్చుకుంటున్నానని తెలిపారు. భాషను నేర్చుకోవడం వల్ల సినిమాలో నటించడం తేలికవుతుందని తెలిపారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని ఆ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రేక్షకులు తనను తమిళంలో మాట్లాడడం లేదేంటి అని అడుగుతున్నారని, అయితే తాను దక్షిణాది అమ్మాయిని కానని తెలిపారు. ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నట్లు తెలిపిన ఆమె తన వల్ల అయినంత వరకు ఒక్కో భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా ఆ భాషలో మాట్లాడడమే ముఖ్యమని, అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు కాస్త సమయం ఇస్తే తెలుగు, తమిళం, మలయాళం భాషలను నేర్చుకుని సరళంగా మాట్లాడతానని అన్నారు. అలాగే తన రాబోయే చిత్రాల గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులను మెప్పించాలనే నా తపన: కయాదు లోహర్
డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటిని ప్రశ్నించగా ఆమె బదులిస్తూ.. తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని తెలిపారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూపిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువన్నారు. కాబట్టి వైవిధ్య భరిత కథా చిత్రాల్లో నటించి వారిని మెప్పించాలని చూస్తున్నట్లు తెలిపారు. కాగా కయాదు లోహర్ కోలీవుడ్‌కు డ్రాగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. తరువాత ఇతర భాషల్లోనూ వరుసగా అవకాశాలు వచ్చాయి. మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల చిత్రాల్లో ఆమె ప్రస్తుతం నటిస్తున్నారు. కయాదు లోహర్ ఇటీవల తెలుగులో నటించిన ఫంకీ అనే చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఈమె మలయాళంలో నటిస్తున్న పళ్లిచటంబి అనే మూవీ త్వరలో విడుదల కానుంది.
కయదు లోహర్ తెలుగులో నానికి జోడీగా ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అంతకు ముందు తమిళంలో నటించిన ఇమ్మోర్టల్, ఇదయం మురళి అనే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ నటుడు శింబుకు జోడీగా ఆయన 49వ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. అలాగే మరో మలయాళ చిత్రంలోనూ ఈమె నటిస్తున్నారు.












