
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ హారర్-కామెడీ చిత్ర ట్రైలర్ 3 నిమిషాల పాటు పూర్తి వినోదాన్ని అందించింది. ఇప్పటికే పలు టీజర్లు, స్నీక్ పీక్స్ విడుదలైన తరువాత ఇప్పుడు పూర్తి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబో 14 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ అవుతుండడం విశేషం. ఈ ఇద్దరూ హేరా ఫెరి, గరం మసాలా, భూల్ భులయ్యా, దే దనా ధన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అందువల్ల భూత్ బంగ్లా సినిమాతో వారి రీ-యూనియన్ పాత అభిమానుల్లో నోస్టాల్జియాను రేకెత్తిస్తోంది.
వధుసర్ అనే భయంకరమైన శక్తి..
ట్రైలర్ ప్రారంభంలో వధుసుర్ అనే భయంకరమైన అద్భుత శక్తిని పరిచయం చేస్తారు. వధుసుర్ పోలేదు, మరింత శక్తివంతమైంది.. అనే వాక్యంతో కథ ప్రారంభమవుతుంది. వధుసుర్‌ను తిరిగి జీవింపజేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని ప్రారంభ సన్నివేశాలు సూచిస్తాయి. తర్వాత అక్షయ్ కుమార్ అర్జున్ పాత్రలో ప్రవేశించడంతో ట్రైలర్ హాస్యభరితంగా మారుతుంది. ఈ చిత్రంలో 2025లో కన్నుమూసిన ప్రముఖ నటుడు అస్రాని కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కానీ అర్జున్ భూత్ బంగ్లాలో నివసించడం ప్రారంభించిన తర్వాత అతను అనూహ్యమైన అతీంద్రియ సంఘటనల్లో చిక్కుకుపోతాడు. స్థానికులు వధుసుర్ గురించి భయంతో ఉంటూ అది మరింత శక్తివంతమైందని చెబుతూ అర్జున్‌ను హెచ్చరిస్తారు.
భయానకంగా సన్నివేశాలు..
అదే సమయంలో కోట వాతావరణం భయానకంగా మారుతుంది. అర్ధరాత్రి పియానోలు స్వయంగా వాయించడం, ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపించడం వంటి సంఘటనలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. తరువాత ట్రైలర్‌లో రాజ పాల్ యాదవ్, పరేష్ రావల్ తో కలిసి అక్షయ్ కుమార్ కామెడీ కలయిక కనిపిస్తుంది. అలాగే వామికా గబ్బి అక్షయ్ కుమార్ ను ప్రేమించే పాత్రలో కనిపిస్తుంది. అస్రాని చెప్పే మంగళాపూర్‌లో ఎవరూ పెళ్లి చేసుకోరు. వధుసుర్ వస్తుంది.. అనే డైలాగ్‌తో ట్రైలర్ హారర్ వైపు మలుపు తిరుగుతుంది. చెట్టు నుంచి ఒక చెయ్యి బయటకు రావడం, చుట్టూ వావిళ్లు ఎగరడం వంటి దృశ్యాలు భయానకతను మరింత పెంచుతాయి. ఇక టబు పాత్ర కూడా ట్రైలర్‌లో ముఖ్యంగా కనిపిస్తుంది. కొద్దిపాటి సన్నివేశాల ద్వారానే ఆమె పాత్రలో లోతు, తీవ్రత స్పష్టమవుతుంది.
మారిన విడుదల తేదీ..
అర్జున్ అతీంద్రియ సంఘటనలను నమ్మకుండా భూత్ బంగ్లాను విడిచి వెళ్లడానికి నిరాకరిస్తాడు. కానీ అతను ఎదుర్కొంటున్న భయానక వాస్తవాలను అంగీకరించాల్సి వస్తుంది. ఈ భారీ భవనం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో ట్రైలర్ నవ్వులు, ఉత్కంఠ, భయం కలగలిపిన అనుభూతిని అందిస్తుంది. ఈ చిత్రం మొదట ఏప్రిల్ 10, 2026న విడుదల కావాల్సి ఉండగా ధురంధర్ 2: ది రివెంజ్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు భూత్ బంగ్లా ఏప్రిల్ 16, 2026న పెయిడ్ ప్రివ్యూలతో విడుదల కానుంది.












