
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమి పాలైందని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ జియో హాట్ స్టార్‌తో పఠాన్ మాట్లాడుతూ సన్ రైజర్స్ జట్టు ప్రారంభంలోనే వికెట్లను కోల్పోవడం మైనస్ అయిందని, పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు. దీని వల్ల భారీ స్కోరు చేసే అవకాశాన్ని సన్ రైజర్స్ కోల్పోయిందని, ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపించిందని అన్నారు. మ్యాచ్ ప్రారంభంలో తమ మెథడ్స్‌ను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని, మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ అనడం గమనించానని, అయితే వరుసగా వికెట్లు కోల్పోతే కాస్త బాధ్యతగా ఆడాలని, కానీ ఆ మ్యాచ్‌లో అలా జరగలేదని అన్నారు.
అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిందే: ఇర్ఫాన్ పఠాన్
పవర్‌ప్లేలోనే 3 వికెట్లను కోల్పోవడంతో సన్ రైజర్స్ ప్రారంభంలోనే ఒత్తిడిలో పడిందని, దీంతో మిడిలార్డర్ వేగాన్ని పెంచడం కంటే ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సి వచ్చిందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. చివరకు 200 పరుగుల మార్క్‌ను చేరుకున్నప్పటికీ పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ స్కోరు సరిపోదని అన్నారు. బౌలింగ్ విభాగంలో సన్ రైజర్స్ కు సరైన వనరులు లేవని, ఈ కొరత కూడా వారికి ప్రధాన సమస్యగా మారిందని పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మ్యాచ్‌లో కీలక దశల్లో బౌలింగ్ పై నియంత్రణ కొరవడిందని, అది జట్టుకు నష్టం కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో టోర్నమెంట్‌లో ముందుకు సాగాలంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మెరుగు పడాల్సిన అవసరం ఉందని, పవర్ ప్లేలోనూ బాధ్యతగా ఆడాల్సి ఉంటుందని పఠాన్ స్పష్టం చేశారు.
బలహీనంగా సన్ రైజర్స్ బౌలింగ్..
కాగా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ బెంగళూరు ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు గతేడాది తొక్కిసలాట మృతులకు ప్లేయర్లు, ప్రేక్షకులు నివాళులు అర్పించారు. మ్యాచ్‌లోనూ ఇరు జట్లకు చెందిన ప్లేయర్లు నలుపు రంగు బ్యాండ్లను ధరించి ఆడారు. టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా సన్ రైజర్స్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. తరువాత లోయర్ ఆర్డర్‌లో వచ్చిన అనికేత్ వర్మ 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు 15.4 ఓవర్లలోనే 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. కోహ్లి, పడిక్కల్‌ల విజృంభణతో ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ విజయం సాధించింది. అయితే సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. చెప్పుకోదగిన బౌలర్లు ఎవరూ లేరు. దీంతో ముందు ముందు టోర్నీలో సన్ రైజర్స్ కు ఆ విభాగంలో కష్టాలు ఎదురుకాక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సన్ రైజర్స్ జట్టు తమ తరువాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 5, 2026న సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.












