
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుసుకునేందుకు తాను బాలీవుడ్‌ను విడిచిపెట్టి హాలీవుడ్‌కు వెళ్లానని నటి ప్రియాంక చోప్రా తెలియజేసింది. ఇటీవల అమాండా హిర్ష్ నిర్వహించిన నాట్ స్కిన్నీ బట్ నాట్ ఫ్యాట్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక తన బాలీవుడ్ టు హాలీవుడ్ జర్నీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ పీక్ స్థాయిలో ఉన్న దశలో అలాంటి ఇండస్ట్రీని ఎందుకు విడిచిపెట్టారు అన్న ప్రశ్నకు కూడా ప్రియాంక సమాధానం ఇచ్చింది.
పరిమితుల్లో చిక్కుకున్నట్లు అనిపించింది: ప్రియాంక
నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ శిఖర స్థాయిలో ఉన్న సమయంలో బాలీవుడ్‌ను విడిచి హాలీవుడ్లో అవకాశాలను అన్వేషించాలనే నిర్ణయంపై స్పందించింది. హిందీ సినిమాల్లో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్న అనంతరం పాశ్చాత్య దేశాలకు వెళ్లిన ప్రియాంక తాజా పాడ్‌కాస్ట్‌లో తన జీవితంలోని ఆ కీలక మలుపును గుర్తు చేసుకుంది. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని తరువాత బాలీవుడ్లో అగ్రనటిగా ఎదిగిన ప్రియాంక, భారత్‌లో పనిచేస్తున్న సమయంలో తాను పరిమితుల్లో చిక్కుకున్నట్టు అనిపించిందని, అంతర్జాతీయంగా కొత్త అవకాశాలను అన్వేషించాలని భావించానని తెలిపింది. భారత్‌లో పనిచేస్తున్నప్పుడు నాకు కొంత పరిమితిగా అనిపించేది, బయట ప్రపంచంలో ఇంకా ఏమున్నాయో తెలుసుకోవాలని అనిపించింది.. అని ఆమె పేర్కొంది.
హాలీవుడ్లో ఉన్న అవకాశాలను తెలుసుకోవాలనే..
ప్రపంచ వినోద రంగంలో భారతీయుల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపిందని ఆమె చెప్పింది. ఆ సమయంలో హాలీవుడ్లో భారతీయ మూలాలున్న నటులు చాలా తక్కువగా ఉన్నారని ఆమె గుర్తుచేసింది. మిండీ కాలింగ్, ఐశ్వర్య రాయ్ తప్ప హాలీవుడ్లో భారతీయ నటులు చాలా తక్కువగా ఉండేవారు. అప్పుడు మనకు ఆ ప్రాతినిధ్యం ఎందుకు లేదని అనిపించింది.. అని ప్రియాంక తెలిపింది. అమెరికాలో 9వ తరగతిలో చదువుతున్నప్పుడు ఎవరూ నా లాంటి వాళ్లు కనిపించకపోవడం గుర్తొచ్చింది. హాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నించేటప్పుడు నేను ఎక్కడ నిలుస్తాను? ఎలా ప్రారంభించాలి? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి, అక్కడ ఉన్న అవకాశాలను తెలుసుకోవాలనే ఆసక్తి నుంచే ఈ నిర్ణయం తీసుకున్నాను.. అని ఆమె వివరించింది.
మార్పులను స్వీకరించాలి..
భారత చిత్ర పరిశ్రమలో ఎదురైన కఠిన అనుభవాలపై వచ్చిన ఊహాగానాలపై కూడా ప్రియాంక స్పందించింది. ప్రతి కెరీర్లో సవాళ్లు ఉంటాయని, కానీ ప్రతికూల పరిస్థితుల్లో నిలిచిపోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. నేను చెడు పరిస్థితుల్లో ఉండటం ఇష్టపడను. అలా ఉంటే ఆ పరిస్థితికి అలవాటు పడిపోతాం.. అని ఆమె వ్యాఖ్యలు చేసింది. జీవితంలో మార్పులు స్వీకరించడం తన ప్రయాణంలో కీలకమని ప్రియాంక పేర్కొంది. జీవితం కఠినంగా మారినప్పుడు మనం మళ్లీ లేచి నిలబడగలగాలి. బాధను అంగీకరించి, కొంత సమయం తీసుకుని, తరువాత దిశ మార్చుకోవాలి. నా కెరీర్లో నేను అనేకసార్లు అలా చేశాను.. అని ఆమె తెలిపింది.
వారణాసితో భారత ప్రేక్షకుల ముందుకు..
హాలీవుడ్లో అవకాశాలు అన్వేషించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు తనకు స్పష్టమైన మార్గరేఖ లేదని కూడా ఆమె ఒప్పుకుంది. నాకు తెలిసింది ఒక్కటే, నేను కష్టపడే వ్యక్తిని, నా కళపై నాకు నమ్మకం ఉంది. ఏ దర్శకుడు లేదా సహనటుడితో పనిచేసినా నేను సమానంగా నిలబడగలను. ఆ విశ్వాసంతోనే నేను అక్కడికి వెళ్లి పని ప్రారంభించాను.. అని చెప్పింది. బర్ఫీ, మేరీ కోమ్, దిల్ ధడక్ నే దో, బాజీరావ్ మస్తానీ వంటి విజయవంతమైన హిందీ చిత్రాల తరువాత, ప్రియాంక2015లో క్వాంటికో టెలివిజన్ సిరీస్‌తో అంతర్జాతీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత బేవాచ్, సిటడెల్, లవ్ అగైన్, ది బ్లఫ్ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఇక ఆమె త్వరలోనే భారతీయ సినీ రంగంలోకి మళ్లీ రానుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రంలో మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్‌లతో కలిసి నటించనుంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.












