
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు అజిత్ కుమార్ ఎట్టకేలకు చెన్నైకి తిరిగి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన దుబాయ్‌లో ఉన్నారు. ఇప్పటికే అజిత్ కుమార్ సురక్షితంగా చెన్నై చేరుకోగా ఆయనను అక్కడి విమానాశ్రయంలో గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అజిత్ తన సామానుతో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి కార్ వైపు నడుస్తూ కనిపించారు. అనంతరం ఆయన తన లగేజ్‌తో కారులో కూర్చొని అక్కడి నుంచి బయలుదేరినట్లు క్లిప్‌లో కనిపించింది. కాగా నటుడు అజిత్ ఈమధ్య కాలంలో భారత్‌లో కన్నా ఎక్కువగా దుబాయ్‌లోనే గడుపుతున్నారు.
గత కొంత కాలంగా దుబాయ్‌లోనే..
అజిత్ మేనేజర్ ఈ నెల ప్రారంభంలో ఓ సమాచారం ఇచ్చారు. మార్చి 1న జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అజిత్ దుబాయ్ నుంచి ఇండియాకు రావాలనుకున్నారు. కానీ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి వచ్చేశారు. ఆయన దుబాయ్‌లో సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే తాజాగా అజిత్ అక్కడి నుంచి చెన్నైకి చేరుకోవడంతో ఫ్యాన్స్ ఎంతో ఊరట చెందారు. అజిత్ గత కొంత కాలంగా దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆయనకు మోటార్ స్పోర్ట్స్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. అందువల్లే దుబాయ్‌కి తరచూ వెళ్తున్నారు. అందులో భాగంగానే అక్కడికి ఇటీవల వెళ్లిన ఆయన యుద్ధం కారణంగా చిక్కుకుపోయారు. ఇప్పుడు ఇండియాకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Ajith sir at Chennai airport.
| #AK #Ajith #Ajithkumar | #AK64 | pic.twitter.com/1S5Qg7kOee
— Ajith (@ajithFC) March 10, 2026
విదేశీయుల అవస్థలు..
ఇక కేవలం అజిత్ మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కూడా దుబాయ్‌లో చిక్కుకుని ఒక్కొక్కరుగా భారత్‌కు వస్తున్నారు. యుద్ధం కారణంగా పరిమిత సంఖ్యలోనే విమానాలను నడిపిస్తుండడంతో ప్రయాణికులకు సర్వీసులు లభ్యం కావడం కష్టంగా మారింది. మరోవైపు చమురు ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు టిక్కెట్ల చార్జిలను భారీగా పెంచాయి. ఇది ప్రయాణికులకు పెనుభారంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే చిక్కుకుపోయిన అనేక ఇతర దేశాల పౌరులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో అక్కడి దేశాలకు విదేశీయులకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాయి. యూఏఈలో విదేశీయులకు హోటళ్లలో ఇప్పటికే ఉచిత వసతిని కల్పించారు. ఈ క్రమంలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని అందరూ భయాందోళనలతో ఎదురు చూస్తున్నారు.












