
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు. ప్రతి రాష్ట్రం తనకంటూ ప్రత్యేక రుచులు, వంటకాలతో ప్రసిద్ధి చెందిందని, ఒకే ఒక్క వంటకం ద్వారా భారతీయ ఆహార అనుభవాన్ని నిర్వచించడం దాదాపు అసాధ్యమని అన్నారు. తాజాగా కాండే నాస్ట్ ట్రావెలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తొలిసారి భారత్‌కు వచ్చే వారు తప్పక రుచి చూడాల్సిన ఒక భారతీయ వంటకం ఏది అని ఆమెను అడగ్గా, దేశం నుంచి ఒక వంటకాన్ని ఎంపిక చేయడం కష్టం అని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆమె తన దృష్టిని కేవలం ముంబై నగరంపై మాత్రమే కేంద్రీకరించానని చెప్పారు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన పలు వంటకాల గురించి ఆమె వివరించారు.
ఆ వంటకం అంటే ఇష్టం..
ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంకా.. ఒకే వంటకాన్ని ఎంపిక చేయడం కష్టం అని వివరించారు. భారతదేశం చాలా వైవిధ్యభరితమైన దేశం. రాష్ట్రాలు, నగరాలు మారే కొద్దీ ఆహారం, మసాలాల రుచులు కూడా మారుతాయి.. అని ఆమె అన్నారు. అయితే ముంబై గురించి ప్రత్యేకంగా అడిగినప్పుడు మాత్రం ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. భేల్ అని ఆమె సమాధానమిచ్చారు. ఇది పొంగించిన బియ్యంతో తయారయ్యే ఒక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ అని, దీనిలో పుల్లగా, కరకరలాడే పదార్థాలు కలిపి తయారు చేస్తారని వివరించారు. అదనంగా దీన్ని కాగితపు కోన్ ఆకారంలో, పాత వార్తాపత్రికలో వడ్డిస్తారు.. అనే ప్రత్యేకత కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.
భారతీయ వంటకాలనే ఇష్టపడతా..
కాగా 2025 జూలైలో కూడా ప్రియాంకా తన రోజువారీ ఆహార అభిరుచుల గురించి మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తనకు భారతీయ ఇంటి వంటకాలపైనే ఎక్కువ మక్కువ ఉందని ఆమె చెప్పారు. స్టఫ్డ్ పరాఠాలు, దాల్, ఆలూ గోభీ, తాజా ఫుల్కాలు వంటి ఇంటి వంటకాలను తినడం తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అంతేకాకుండా చేప కూర, పెరుగు అన్నం వంటి వంటకాలను కూడా ఇష్టపడతానని చెప్పారు. ఇది ఆమె మలయాళీ మూలాలను గుర్తుచేసే అంశమని ఆమె పేర్కొన్నారు. అలాగే సౌకర్యంగా అనిపించే సమయంలో ఇడ్లీలు, దోసెలు, పోహా వంటి సాధారణ వంటకాలను కూడా తినడం తనకు ఇష్టమని తెలిపారు. తనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ విషయంలో కూడా ప్రియాంకా అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఒక సరదా ఫుడ్ ఛాయిస్ చాలెంజ్‌లో పాల్గొన్నప్పుడు, ముంబైకి ఎంతో ప్రీతిపాత్రమైన వడా పావ్ కంటే క్లాసిక్ హాట్ డాగ్‌ను ఎంపిక చేసి అనేక మందిని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి సరదా స్పందనలు వచ్చాయి.












