
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, అందుకనే బాహుబలి సక్సెస్‌ను తాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయానని నటుడు దగ్గుబాటి రానా అన్నారు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి చాప్టర్ 2 అనే కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడారు. బాహుబలి అనంతరం తన జీవితం ఎలా మారిపోయిందో ఆయన వివరించారు. బాహుబలి సక్సెస్ తరువాత తనకు కిడ్నీ ఫెయిల్యూర్, హృదయ సంబంధిత సమస్యలు వచ్చాయని అన్నారు. అమెరికాలో అత్యవసర ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నానని తెలిపారు. ఆ దశలో తనకు కావల్సింది స్టార్ డమ్ కాదని, బతకడమే అని నిర్ణయించుకున్నానని, అందుకనే పలు భారీ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
భారీ ప్రాజెక్టులను వదులుకున్నా: రానా
బాహుబలి తరువాత వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలు చేయడం సాధ్యపడక పోవడంతో అప్పటికే సైన్ చేసిన పలు భారీ సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను కూడా తిరిగి ఇచ్చానని రానా తెలిపారు. ఓ రెజ్లర్ పాత్రతో చేయాల్సిన సినిమాతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు అప్పటికే లైన్‌లో ఉన్నాయని, కానీ శస్త్ర చికిత్స అనంతరం తన శరీరం పూర్తిగా మారిపోయిందని అన్నారు. తాను సైన్ చేసిన సినిమాల్లోని పాత్రలకు తన శరీరం సరిపోదని, అందుకనే ప్రాజెక్టులను వదులుకున్నానని, అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేశానని తెలిపారు. ఆ సమయంంలో తనకు బతకడం ఒక్కటే ముఖ్యమని అనిపించిందని, సినిమాలు తరువాతి సంగతి అనుకున్నానని రానా వెల్లడించారు.
మానసికంగా కష్టం అనిపించింది అంటూ..
తన ఆరోగ్యం క్షీణించిన దశలో శరీర ఆకృతి, ఆకారం, రూపం పూర్తిగా మారిపోయాయని రానా తెలిపారు. కానీ ఒకసారి ఇమ్మిగ్రేషన్ సమయంలో ఓ అధికారి తనను గుర్తు పట్టి కింగ్ భల్లాలదేవ అని పిలిచారని, అది తనకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని అన్నారు. మరో సంఘటనలో వరుణ్ తేజ్ తనను కలిసినప్పుడు అతన్ని చూస్తే పాత రానాను చూసినట్లు అనిపించిందని అన్నారు. తనను తానే గుర్తు పట్టలేని స్థితిలో మానసికంగా కూడా ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించిందన్నారు. అయితే ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్లీ సినిమాల్లోకి వచ్చానని రానా తెలిపారు. ఇకపై తనకు ముఖ్యమైనవి అనిపించిన సినిమాలే చేయదలుచుకున్నానని తెలిపారు. కాగా 2025లో విడుదలైన కాంత మూవీలో రానా నటించారు. ఆ మూవీకి ఆయన సహ నిర్మాతగా కూడా ఉన్నారు. అలాగే మిరాయ్, పరాశక్తి సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించారు. ఇక ప్రస్తుతం ఆయన రానా నాయుడు సీజన్ 2, ది రానా దగ్గుబాటి షో, సోలో లెవలింగ్ కు వాయిస్ ఓవర్ వంటి భిన్న పనులతో బిజీగా ఉన్నారు.












