
ప్రస్తుతం చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. అలాగే కోవిడ్ అనంతరం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కూడా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు. గంటల తరబడి కూర్చుని ఆఫీసు కార్యకలపాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి నడుము నొప్పి సమస్య వస్తోంది. శారీరకంగా చురుకుదనం తగ్గిపోవడం, పని ఒత్తిడి, అస్తవ్యవస్తమైన నిద్ర, ఆహారపు అలవాట్లు వంటి కారణాలు కూడా ఈ నొప్పి వచ్చేందుకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో నడుము నొప్పితో అనేక మంది బాధపడుతున్నారు. ఈ నొప్పి చాలా మందిని రోజూ ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో పనులు చేయలేకపోతున్నారు. అయితే ఇదే సమస్యపై ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్టు, డైటిషియన్, రచయిత పూజా మఖిజా స్పందించారు. నడుము నొప్పి ఉన్నవారు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు.
అతి డైటింగ్ వద్దు..
నడుము నొప్పి ఉన్నవారు దాన్ని అశ్రద్ధ చేయకూడదని, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని పూజా మఖిజా అన్నారు. నడుము నొప్పి రోజువారి పనులను ప్రభావితం చేస్తుందని, అయితే దీనికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుందని అన్నారు. నడుము నొప్పి ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ స్వార్వేషన్ డైట్లు చేయకూడదని ఆమె సూచించారు. టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ లేదా అతి తక్కువ క్యాలరీలను అందించే డైట్లను పాటించకూడదని, ఇవి శరీరానికి కావల్సిన శక్తిని దూరం చేస్తాయని తెలిపారు. దీని వల్ల కండరాల నష్టం జరుగుతుంది. కండరాలు బలహీనపడితే వెన్నెముకపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పి మరింత తీవ్రమవుతుందని పూజా మఖిజా వివరించారు.
విటమిన్ డి, నల్ల నువ్వులు..
విటమిన్ డి స్థాయిలను తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. నడుము నొప్పికి ప్రధాన కారణాల్లో విటమిన్ డి లోపం ఒకటిగా ఉంటుందని ఆమె చెప్పారు. రక్తంలో 25 హైడ్రాక్సీ విటమిన్ డి స్థాయిలు 50 నుంచి 60 ఎన్జీ/ఎంఎల్ మధ్య ఉండాలని సూచించారు. రోజువారి ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవాలని తెలిపారు. రోజుకు 2 టీస్పూన్ల నల్ల నువ్వులు తీసుకుంటే కాల్షియం శోషణ మెరుగవుతుందని, తెల్ల నువ్వులు తొక్కతీసినవిగా ఉండటంతో కాల్షియం శోషణ తగ్గే అవకాశం ఉండగా, నల్ల నువ్వులు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆమె తెలిపారు. మెగ్నిషియం సప్లిమెంట్లు కండరాల విశ్రాంతికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి లోయర్ బ్యాక్ పైన ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
చురుకుదనం అవసరం..
అలాగే బోస్వెల్లియా (గోండు) ఎక్స్ట్రాక్ట్ ను సుమారు 450 మిల్లీగ్రాములు తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పులకు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇది శక్తివంతమైన సహజ పదార్థమని ఆమె తెలిపారు. ఆహారంతో పాటు శారీరక చురుకుదనం కూడా కీలకమని ఆమె అన్నారు. డెస్క్ జాబ్ చేసే వారు రోజంతా కదలికలు ఉండేలా చూసుకోవాలి. వీలైతే నేలపై కూర్చుని పని చేయడం లేదా సరైన వర్క్డెస్క్లో వెన్నెముక నేరుగా ఉండేలా కూర్చోవడం ద్వారా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చని ఆమె సూచించారు.
View this post on Instagram
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన, సమాచారం కోసం మాత్రమే. చికిత్సకు లేదా సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉన్నా, సలహా అవసరం అయినా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.








