రూ. 6,000 కోట్ల భారీ స్కామ్.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల స్కామ్ ను తాము వెలుగులోకి తెచ్చామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

February 4, 2026 7:28 PM
KTR press conference on alleged Rs 6,000 crore corruption in Telangana Congress government.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలతో సహా బయటపెడతామన్న కేటీఆర్. Photo Credit: Telangana Today.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల స్కామ్ ను తాము వెలుగులోకి తెచ్చామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దివాలా ప్రక్రియలో ఉన్న కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కు భారీ ప్రభుత్వ పనులు కట్టబెట్టడం వెనుక ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సంబంధించిన బెనామీ వ్యవహారం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మూసీ నది ప్రాజెక్టు, లగచర్ల భూములు, అమృత్‌ పథకం టెండర్లు, సింగరేణి బొగ్గు టెండర్లు, హెచ్‌ఐఎల్‌టీపీ భూ లావాదేవీలు వంటి అనేక అంశాల్లో అక్రమాలు బయటపెట్టామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తమ నాయకులకు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసులు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సుప్రీంకోర్టు నోటీసులే కీలకం

ఈ వ్యవహారానికి మరింత బలం చేకూర్చుతూ, జనవరి 23న సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. 2023 నుంచే దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి, మధ్యంతర రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ అనుమతి లేకుండానే వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. 2023 నుంచి 2025 మధ్య కాలంలో కోడంగల్-నారాయణపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, యంగ్‌ ఇండియా స్కూళ్లు, అమృత్‌, జల్‌ జీవన్‌ మిషన్‌, మెదక్‌, సూర్యాపేట రోడ్డు పనులు, మిషన్‌ భగీరథ సరఫరాలు, కొడంగల్‌ వెటర్నరీ కాలేజ్‌ నిర్మాణం వంటి అనేక కీలక పనులు కేఎల్‌ఎస్‌ఆర్‌కు అప్పగించారని ఆరోపించారు.

తక్షణ చర్యలు తీసుకోవాలి

దివాలా కంపెనీకి రూ.6 వేల కోట్ల ప్రజాధనం అప్పగించడం కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది అధికార దుర్వినియోగం.. అని కేటీఆర్ అన్నారు. వెంటనే అన్ని కాంట్రాక్టులను రద్దు చేయాలని, పనులను నిలిపివేయాలని, కంపెనీని బ్లాక్‌లిస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎస్‌ఎఫ్‌ఐఓ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అవసరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ రేవంత్‌ రెడ్డిని కాపాడుతుంద‌ని, లేదంటే వెంటనే కేంద్ర ఏజెన్సీలు రంగంలోకి దిగాలి.. అని సవాల్‌ విసిరారు.

ఆధారాలతోనే ఆరోపణలు

కేఎల్‌ఎస్‌ఆర్‌ జీతాలు చెల్లించడానికి కూడా అప్పులపై ఆధారపడుతుంటే, బ్యాంక్‌ గ్యారంటీలు ఎలా తెచ్చిందని, ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా సాధించిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఇతర కంపెనీలతో నిధుల లావాదేవీలపై గతంలో ఐటీ దాడుల్లో ఆధారాలు లభించాయని, ముఖ్యమంత్రి పదవికి ముందే ఆ సంస్థకు చెందిన లగ్జరీ వాహనం వాడిన ఫొటోలు కూడా విడుదల చేశారు. మేం ఊహాగానాలు చేయడం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్షం మేం.. అంటూ రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment