
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కోర్టు వ్యవహారాల్లో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో, సినిమా విడుదల మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు నిర్మాతలు కోర్టు వెలుపలే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోలీవుడ్ వర్గాల తాజా కథనాల ప్రకారం, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిర్ణయంపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించాలని సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా, అది పూర్తి స్థాయి న్యాయ వివాదంగా మారి సినిమా విడుదలకు తీవ్ర ఆటంకంగా నిలిచింది.
సెన్సార్ మార్పులకు చిత్ర యూనిట్ ఓకే..?
మద్రాస్ హైకోర్టు ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, కేసును మళ్లీ విచారణకు పంపడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో విడుదల తేదీపై అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్మాతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ ఆలస్యం సినిమా వ్యాపారంపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుతో రాజీ కుదుర్చుకుని, రివైజింగ్ కమిటీ ముందు చిత్రాన్ని మళ్లీ ప్రదర్శించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు, సవరణలను అమలు చేయడానికీ వారు అంగీకరించినట్లు సమాచారం.
త్వరలోనే కొత్త విడుదల తేదీ..
మంగళవారం (జనవరి 27, 2026) హైకోర్టు తాజా ఉత్తర్వుల తర్వాత, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాత్రమే సినిమా విడుదల కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, విడుదలను ఇక మరింత ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం ఓ స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిన ఈ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్‌తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే, మమిత బైజు కీలక పాత్రల్లో నటించారు. మొదటగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా అది వాయిదా పడింది.








