
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు శరీరంలో వచ్చే మార్పులు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. నడుము వెడల్పు పెరగడం, పాదాల పరిమాణం మారడం, జుట్టు రాలడం, వెజైనల్ డిశ్చార్జ్ (లోకియా), మలబద్ధకం, చర్మంపై స్ట్రెచ్ మార్కులు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత పెరిగిన బరువు మహిళలకు ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో సరైన ఆహారంపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. బరువు తగ్గడానికి ఉపయోగపడే పండ్లలో పైనాపిల్ ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ అధికంగా ఉండడం వల్ల ఇది బరువు నియంత్రణకు సహకరిస్తుంది. అయితే పరిమితిలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.
పోషకాహారం ముఖ్యం..
మదర్‌హుడ్ హాస్పిటల్స్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ మాన్సీ శర్మ మాట్లాడుతూ పైనాపిల్‌లో క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే బ్రోమెలైన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో వాపును తగ్గిస్తుంది, మెటబాలిజానికి మద్దతిస్తుంది. సమతుల్య ఆహారంలో భాగంగా పైనాపిల్‌ను చేర్చుకుంటే గర్భధారణ తర్వాత బరువును నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. డెలివరీ అనంతరం బరువు తగ్గాలా లేక ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరాన్ని స్థిరంగా ఉంచాలా అనే అంశంపై మహిళల్లో చాలాసార్లు సందేహం ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రక్రియ శరీర శక్తి స్థాయిలపై, హార్మోన్లపై, శరీర పునరుద్ధరణపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ దశలో తొందరపడి కఠినమైన డైట్లు కాకుండా, సరైన పోషకాహారమే ముఖ్యమని చెబుతున్నారు.
మంత్రంలా కొవ్వును కరిగించకపోయినా..
డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చనా బాత్రా మాట్లాడుతూ పైనాపిల్ నేరుగా కొవ్వును కరిగించదు. కానీ తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం, బ్రోమెలైన్ వంటి అంశాల వల్ల ఆకలి నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది. నిజమైన కొవ్వు తగ్గుదల మొత్తం క్యాలరీల సమతుల్యత, హార్మోన్ల ఆరోగ్యం, నిద్ర, శారీరక చురుకుదనం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత.. అని వివరించారు. పైనాపిల్ లో ఫైబర్, విటమిన్ సి, బ్రోమెలైన్ అధికంగా ఉంటాయి. ఇవి అనవసరమైన తినుబండారాలపై ఆసక్తిని తగ్గించి, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే తీపి రుచి ఉండడం వల్ల ప్రాసెస్ చేసిన స్వీట్లపై ఆకర్షణ తగ్గుతుంది. అయితే ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు సహకరించేవే తప్ప, మంత్రంలా కొవ్వును కరిగించేవి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇలా తీసుకోవచ్చు..
కొత్తగా తల్లైన మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పైనాపిల్ ఆమ్ల స్వభావం కలిగి ఉండటంతో ఖాళీ కడుపుతో లేదా అధికంగా తీసుకుంటే అసిడిటీ, జీర్ణ సమస్యలు రావచ్చు. పాలిచ్చే తల్లులు ఎక్కువగా తీసుకుంటే శిశువులకు కడుపు నొప్పులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పరిమితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పైనాపిల్ ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సురక్షితమే. పెరుగులో కొన్ని ముక్కలు కలపడం, స్మూతీలో విత్తనాలతో కలిసి మిక్స్ చేయడం, భోజనం తర్వాత ఫ్రూట్ బౌల్‌గా తినడం మంచి మార్గాలు. రోజుకు ఒక చిన్న గిన్నె పరిమాణం సరిపోతుంది. గర్భధారణ తర్వాత బరువు తగ్గడంలో పైనాపిల్ సహాయకారిగా పనిచేస్తుంది. కానీ అదే ఒక్కటే పరిష్కారం కాదని, సమతుల్య ఆహారం, సరైన విశ్రాంతి, తేలికపాటి వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అన్నింటికన్నా ముఖ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఇవన్నీ సాధారణ సమాచారం కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.








