Whale Ambergris : వామ్మో.. జాల‌ర్ల‌కు ల‌భించిన తిమింగ‌లం వాంతి.. ధ‌ర రూ.50 కోట్ల‌ట‌..!

October 3, 2022 1:11 PM

Whale Ambergris : స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లిన కొంద‌రు మ‌త్స్య‌కారుల‌కు ఏకంగా రూ.50 కోట్ల విలువైన తిమింగ‌లం వాంతి ల‌భ్య‌మైంది. ఆ వాంతి బ‌రువు 38.6 కిలోలు ఉండ‌గా.. దాన్ని అంబ‌ర్‌గ్రిస్‌గా పిలుస్తున్నారు. అయితే ఈ వాంతికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది.. అన్న వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడులోని చెంగల్పట్టు జిల్లా కడపాక్కం సమీపంలోని కడకుప్పం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, మాయకృష్ణన్‌, కర్ణన్‌, శేఖర్‌‌లు చేపల వేట కోసం కొద్ది రోజుల కిందట సముద్రంలోకి వెళ్లారు.

నడి సముద్రంలో వారు విసిరిన వల బరువుగా అనిపించింది. దీంతో త‌మ వ‌ల‌కు భారీ చేప చిక్కిందని భావించారు. పైకి లాగే సరికి అందులో చేపకు బదులు మరేదో ఉండటంతో నిశితంగా గమనించారు. చివరకు అది తిమింగలం వాంతిగా గుర్తించి ఈ విషయం గురించి అరుచ్చిపాక్కం అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్ర‌మంలోనే అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఆ ప‌దార్థాన్ని ప‌రిశీలించి దాని బ‌రువు 38.6 కిలోలు ఉంద‌ని.. ధ‌ర రూ.50 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. అయితే తిమింగ‌లం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు.

Tamil Nadu fishermen got Whale Ambergris rs 50 crore value
Whale Ambergris

తిమింగలం వాంతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అరుదైన స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే ఇది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ అనే స‌ముద్ర‌పు జీవుల‌ను మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ లు ముక్కలై ముద్దలా మారిపోతాయి. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే.. అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబ‌ర్‌గ్రిస్ అంటారు. ఇక ఈ అంబ‌ర్‌గ్రిస్ సువాసన వెదజల్లుతుంది.

అందువల్ల దాన్ని పెర్ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. సెంట్లు ఎక్కువ కాలం సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే.. ఈ వాంతి అవసరం ఉంటుంది. ఈ వాంతిని కాల్చినప్పుడు ముందుగా చెడువాసన వస్తుంది. కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ గిరాకీ ఉంది. ఈ వాంతి ఒక్కో కిలో రూ.30,50,620 దాకా ఉంటుంది. థాయ్‌లాండ్ సహా పలు దేశాలకు చెందిన మత్స్యకారులు తిమింగలం వాంతితో ఇప్ప‌టికే కోటీశ్వ‌రులు అయ్యారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇది వ‌ర‌కు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన జాల‌ర్ల‌కు తిమింగ‌లం వాంతి ల‌భించ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment