Roja : 1990 దశాబ్దంలో హీరోయిన్‌గా వెండితెరపై అద్భుతాలు సృష్టించిన నటి రోజా. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషలలోను రోజా తన నటనతో మెప్పించి అలరించింది. అందం కన్నా అభినయం ముఖ్యమని, నలుపు రంగులో కూడా అందం ఉంటుందని నిరూపించిన హీరోయిన్ రోజా. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా తన సత్తాను చాటింది. సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా నిల్చిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తుంది.
మాటకు మాట ఎదురు చెప్పడమే కాదు ఎలాంటి నేతనైనా సరే తన వాక్చాతుర్యంతో నిలదీస్తుంది. ఎక్కడో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సినీ రంగంలోకి రావడం, ఆతర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. ఈ స్థాయికి చేరిన రోజా పడ్డ శ్రమతో పాటు కుటుంబ మద్దతు కీలకంగా నిల్చింది.

రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. రోజా తండ్రి నాగరాజారెడ్డి, తల్లి లలితా రెడ్డి మధ్య తరగతి కుటుంబం వారే. నాగరాజారెడ్డి డాక్యుమెంటరీలో సౌండ్ ఇంజనీర్. తల్లి లలిత నర్సుగా పనిచేసేవారు. రోజాకు కుమారస్వామి రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు సోదరులున్నారు. రోజా తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలో డిగ్రీ చదివి, ఆ తరువాత నాగార్జున యునివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి ఉండడంతో రోజా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.
సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, ముఠా మేస్త్రి, భైరవ ద్వీపం, శుభలగ్నం, పోకిరి రాజా వంటి చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో ఆర్ కె సెల్వమణి డైరెక్షన్ లో చామంతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోజా అక్కడ కూడా ఎన్నో చిత్రాల్లో నటించి హీరోయిన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉండగానే సెల్వమణి ప్రేమలో పడిన రోజా అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు హంసమాలిక, కృష లోహిత్ అనే సంతానం ఉన్నారు.సినిమాల్లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా పలు టీవీ షోల ద్వారా రోజా ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు.