పెళ్లయిన 23 ఏళ్లకు తల్లయ్యింది.. తల్లయిన 15 రోజులకు మృత్యువాత పడింది..

August 5, 2021 8:09 PM

23 సంవత్సరాల నుంచి తల్లి కావాలనే ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. తన బిడ్డలను అలా చూడాలి ఇలా పెంచాలని ఎన్నో కలలు కనింది. అయితే ఆ కలలన్నీ కేవలం పదిహేను రోజుల్లోనే కనుమరుగైపోయాయి.బిడ్డలకు జన్మనిచ్చిన 15 రోజులలోనే తల్లి మృత్యుఒడికి చేరి బిడ్డలను అనాథగా మార్చిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప అనే మహిళకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కి 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి పిల్లలు కావాలని ఎన్నో ఆశలు పడ్డారు. పిల్లల కోసం ఎక్కని గుడి లేదు తిరగని ఆసుపత్రి లేదు.అయినప్పటికీ వీరికి పిల్లలు కలగకపోతే లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో చికిత్స తీసుకుంటూ స్వరూప గర్భం దాల్చింది.

ఈ విధంగా గర్భవతి కావడంతో ఎంతో ఆనందపడింది. ఈ క్రమంలోనే జులై 19వ తేదీన ఆమె ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పిల్లలు బరువు తక్కువగా ఉండటం చేత వారిని హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం కుదుటపడటంతో వారిని చూడటానికి స్వరూప ఆసుపత్రికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె మరొక ఇన్ఫెక్షన్ బారిన పడటంతో ఆమెను మరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే స్వరూప పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది. గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఎంతో వేదన చెందిన స్వరూప ఇప్పుడు ఆ పిల్లలకు దూరమయి వారికి తల్లిలేని బాధను మిగిల్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment