
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి కామెంట్లే చేస్తే బాధగా ఉంటుందని నటి కృతి శెట్టి విచారం వ్యక్తం చేసింది. ఆమె తాజాగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమెకు జోడీగా నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించాడు. నటి నయనతార ఈ సినిమాను నిర్మించగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి శెట్టి కీలక వివరాలను వెల్లడించింది. సినిమా హిట్ అవడం, ఫ్లాప్ అవడం తనకు ఎలా తెలుస్తుందని, అది తన చేతుల్లో ఉండదని, సినిమాలో యాక్టింగ్ పరంగా తనను తాను నిరూపించుకుంటే చాలని ఆమె స్పష్టం చేసింది. కొత్త సినిమా వస్తుందంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువైపోతాయని, కానీ ఆ కామెంట్స్‌ను పట్టించుకోనని, ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.
ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతా..
ఈ సినిమాలో తాను నటిస్తున్నాను కనుక సినిమా డౌటే అని చాలా మంది నెగెటివ్ కామెంట్లు చేశారని కృతి శెట్టి వాపోయింది. అయితే తనను ఎంతగానో అభిమానించే తెలుగు ప్రేక్షకులు తన గురించి ఇలా అనడం తనకు చాలా బాధ కలిగిస్తుందని ఆమె పేర్కొంది. ఎప్పటిలాగే ప్రతి సినిమాకు తాను తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేసింది. ఓ నటిగా తాను చేసే ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతానని, అయితే సినిమాలకు సరైన బాక్సాఫీస్ ఫలితాలు రాలేదని తెలిపింది. దీని వల్ల తన హార్డ్ వర్క్ గురించి కాకుండా తనకు లక్ లేదని కామెంట్లు చేస్తున్నారని తెలిపింది. ఇలా చేయడం తనకు బాధగా ఉంటుందని, సినిమా రిజల్ట్ అనేది తన చేతిలో ఉండని చెప్పింది. అయితే అలాంటి కామెంట్స్ వల్ల ఒక అవకాశం మిస్ కావడమనేది బాధగా ఉంటుందని పేర్కొంది.
పాజిటివ్ థింకింగ్ ముఖ్యం..
ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్ర విశేషాలను కూడా కృతి శెట్టి పంచుకుంది. ఈ సినిమాలో తాను ధీమా అనే పాత్రలో నటించానని, తనకు నోమోఫోబియా ఉంటుందని, దీని వల్ల చేతిలో ఫోన్ లేకపోతే భయం వేస్తుందని తెలిపింది. సోషల్ మీడియాకు బానిస అయిన ఓ అమ్మాయి పాత్రలో యాక్ట్ చేయడం తనకు కొత్తగా అనిపించిందని, ఈ సినిమాతో నటి నయనతారతో మంచి రిలేషన్ ఏర్పడినట్లు తెలిపింది. ఒకసారి ఓ సమస్య వచ్చి ఆమెకు ఫోన్ చేయగానే, వెంటనే లిఫ్ట్ చేశారని, ఆమె మంచి సలహా ఇచ్చారని తెలియజేసింది. అయితే తన సినిమాలపై నెగెటివ్‌గా ట్రోల్స్ చేసేవారు నెగెటివ్‌గానే ఆలోచిస్తుంటారని, కానీ మనిషికి పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యమని, తాను అదే ధోరణిలో ఉంటానని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్పైనే ఉందని, 5 లేదా 10 ఏళ్ల తరువాత తనకు నచ్చిన ఓ వ్యక్తితో డేటింగ్ చేసి ఆ వ్యక్తినే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నానని, తమిళంలో మరో మూవీకి సైన్ చేశానని, అలాగే హిందీ మూవీల్లోనూ నటించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని ఆమె తెలియజేసింది.












