
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేమని నటుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో చిత్ర ప్రమోషన్లను ప్రస్తుతం మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ ఆ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదని, గతంలో ఐపీఎల్ లో సరిగ్గా ఆడనందుకు ధోనీపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయని, తనపై గత 10 ఏళ్లుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉందని, నయనతారపై ట్రోల్స్ తక్కువగా వస్తాయని అన్నారు.
ట్రోలింగ్ ఇప్పుడు సాధారణమైపోయింది..
ఇటీవలి కాలంలో ఆన్లైన్లో పోస్టు చేసే ఫోటోలను చూసి ఆనందపడే వారి కంటే వాటిని విమర్శించే వారి సంఖ్య ఎక్కువైందని విఘ్నేష్ శివన్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పెట్టడం వల్ల ఏం లాభమని కొందరు ప్రశ్నిస్తుంటారని, దానికి తన సమాధానం ఇదేనని చెప్పారు. ఉదాహరణకు తాను, నయనతార, తమ పిల్లలు కలిసి ఒక ప్రదేశంలో ఆనందంగా గడిపిన ఫోటోలను షేర్ చేశామని అనుకుంటే, ఆ ఫోటోలను చూసి కొంతమంది బాధలో ఉన్నవారికి కొంత ఉపశమనం లేదా ప్రశాంతత కలగొచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిదీ ట్రోలింగ్‌కు గురవుతోంది. ట్రోలింగ్ అనే సంస్కృతి ఇప్పుడు సాధారణమైపోయింది. నాకు గత పదేళ్లుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఎంఎస్ ధోనీ లాంటి ప్రముఖులను కూడా ఇది వదలలేదు. ఐపీఎల్లో ఆయన బాగా ఆడకపోయినప్పుడు ఎంత విమర్శలు ఎదుర్కొన్నారో గుర్తుంచుకోండి. ఇది నిజంగా బాధాకరం.. కానీ మనం ఏం చేయగలం? అని అన్నారు.
కామెంట్లను పట్టించుకోకూడదు..
ఇలాంటి కామెంట్లను పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగడమే మన చేతిలో ఉన్న మార్గం అని విఘ్నేష్ శివన్ తెలిపారు. కొన్నిసార్లు తాను, నయనతార ఈ ట్రోల్స్ గురించి సరదాగా మాట్లాడుకుంటామని అన్నారు. నేను ఆమెతో నీ గురించి అంతగా మాట్లాడటం లేదు, కానీ నన్ను మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు.. అని చెబుతుంటాను.. అని ఆయన నవ్వుతూ చెప్పారు. ట్రోలింగ్ చేసే వారు మారే అవకాశాలు తక్కువగా ఉన్నందున వాటిని లైట్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. కాగా నానుమ్ రౌడీ దాన్ (నేను రౌడీనే) సినిమా ద్వారా దర్శకుడిగా విఘ్నేష్ శివన్ మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం జూన్ 2022లో వీరు వివాహం చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే దీనిపై అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది. ఈ దెబ్బకు సరోగసీ రూల్స్‌నే మార్చేశారు. ఇక నయనతార ఇటీవల తెలుగులో మన శివశంకర వర ప్రసాద్ గారులో యాక్ట్ చేయగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.












