
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ఆమె త్వరలోనే ఓ బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకోనుందని ప్రచారం ఎక్కువైంది. ఆమె సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే వాటికి సాయిపల్లవి ఫుల్‌స్టాప్ పెట్టింది. ప్రస్తుతం తాను సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆమె వివాహం పట్ల వస్తున్న వార్తలు వదంతులే అని తేలింది. సోషల్ మీడియాలో లేదా, సినిమా వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దని, అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. కాగా సాయిపల్లవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఏదైనా ఉంటే నేనే చెబుతా: సాయి పల్లవి
వెండితెరపై మేకప్ లేకుండా మెరిసిపోయే నటి ఎవరు.. అని అడిగితే చాలా మందికి సాయిపల్లవి పేరు ఠక్కున గుర్తుకు వస్తుంది. ఆమె ప్రేమమ్ సినిమాలో మలర్ టీచర్‌గా అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించింది. తక్కువ కాలంలోనే సౌతిండియాపై తనదైన ముద్ర వేసింది. కేవలం నటనతోనే కాకుండా తన డ్యాన్స్‌తోనూ ఎంతో మంది అభిమానులను ఆమె సంపాదించుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఆమె వివాహం చేసుకోబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఆమె ఎల్లప్పుడూ ఆ వార్తలకు స్పందిస్తూ అవన్నీ పుకార్లేనని కొట్టి పారేస్తోంది కూడా. అందులో భాగంగానే తాజాగా మరోమారు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. ఆ వార్తలను నమ్మవద్దని, ఏదైనా ఉంటే తానే చెబుతానని ఆమె స్పష్టం చేసింది.
సినిమాల్లో బిజీ బిజీగా..
ఇక సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె గతంలో ఎన్నడూ లేనంత బిజీగా ప్రస్తుతం ఉంది. గతేడాది నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్‌ను సాధించింది. అయినప్పటికీ అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తోంది. ఈ మూవీకి ఏక్ దిన్ అనే పేరును ఖరారు చేశారు. తెలుగులో ఒక రోజు టైటిల్‌తో ఈ మూవీ విడుదల కానుంది. మే1, 2026న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నార్త్ ప్రేక్షకులను కూడా సాయిపల్లవి తన మ్యాజిక్‌తో ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆమె నటిస్తున్న మరో భారీ ప్రాజెక్టు రామాయణ్. ఇందులో ఆమె సీత పాత్రలో యాక్ట్ చేస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనున్నాడు. అనేక భారతీయ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి చెందిన మొదటి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 8, 2026న రిలీజ్ చేయనున్నారు. అయితే గ్లామర్‌కు దూరంగా ఉండే సాయిపల్లవి.. గ్లామరే ప్రధానంగా ఉండే బాలీవుడ్‌లో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












