గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి వ‌స్తుంద‌ని సినీ న‌టి స‌మంత అన్నారు.

March 27, 2026 6:08 PM
Samantha Ruth Prabhu speaking at The Hollywood Reporter Women in Entertainment event.
‘ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ కార్యక్రమంలో మహిళా సాధికారతపై మాట్లాడుతున్న నటి సమంత. Photo Credit: Samantha/Instagram.

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి వ‌స్తుంద‌ని సినీ న‌టి స‌మంత అన్నారు. హాలీవుడ్ రిపోర్ట‌ర్ సంస్థ నిర్వ‌హించిన ఉమెన్ ఇన్ ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స‌మంత మాట్లాడుతూ చాలా సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు త‌మ అభిప్రాయాలు, ల‌క్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇత‌రుల‌కు అనుకూలంగా మార్చుకుంటున్నార‌ని, అది త్యాగ‌మని కూడా భావించ‌కుండా ముందుకు సాగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మాజంలో గుర్తింపు పొందేందుకు పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌లు మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంద‌ని ఆమె అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మ‌హిళ‌లు త‌మ‌కు తాము విలువ ఇచ్చుకోవాలి: స‌మంత‌

స‌మాజంలో ఇత‌రులు సౌక‌ర్యంగా ఉండ‌డానికి మ‌హిళ‌లు త‌మ అభిప్రాయాలు, షెడ్యూల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ ఉంటార‌ని సమంత పేర్కొన్నారు. త‌మ ఆశ‌యాల‌ను వ‌దులుకుంటూ, ఇత‌రుల కోసం బ‌త‌క‌డం మ‌హిళ‌ల‌కు అల‌వాటైపోయింద‌న్నారు. ఇక‌నైనా మ‌హిళ‌లు ఈ అల‌వాటును మార్చుకోవాల‌ని సూచించారు. త‌మ‌కు తాము విలువ ఇచ్చుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని, సాధించిన విజ‌యాల‌ను గ‌ర్వంగా స్వీక‌రించాల‌ని అన్నారు. సినిమా ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లు త‌గిన గుర్తింపును పొందేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని, పురుష యాక్ట‌ర్ల క‌న్నా రెట్టింపు క‌ష్టం చేయాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ను ఒక రిస్క్‌లాగా లేదా ఒక ప్ర‌త్యేక కేట‌గిరిలాగా చూస్తున్నార‌ని, ఆ రోజులు పోవాల‌ని అన్నారు. వాటిని కూడా భిన్న క‌థ‌లుగా చెప్పుకునే రోజులు రావాల‌ని, తెర‌పై మ‌హిళ‌లు కేవ‌లం హీరోకి భార్య‌గానో, హీరోకి ధైర్యం చెప్ప‌డానికో ప‌రిమితం కాకుండా, నిజ జీవితంలో ఉండే మ‌హిళ‌ల లాగానే క్లిష్ట‌మైన మ‌నస్త‌త్వంతో ఉండాల‌ని అన్నారు.

మ‌హిళ‌లే ఎక్కువ సార్లు సారీ అంటారు..

పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌లే ఎక్కువ సార్లు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నార‌ని స‌మంత అన్నారు. ఒకే ప‌రిస్థితిలో పురుషుల క‌న్నా స్త్రీలే దాదాపు 10 రెట్లు ఎక్కువ సార్లు సారీ అంటార‌ని చాలా మందికి తెలియ‌ద‌ని చెప్పారు. ఇది వారి ఆత్మ విశ్వాసం త‌గ్గిపోవ‌డానికి ఒక సూచ‌న‌గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌తి చిన్న విష‌యానికి క్ష‌మాప‌ణ‌లు కోరాల్సిన అవ‌స‌రం లేద‌ని, మ‌హిళ‌లు ఇలా త‌మ‌ని తాము త‌గ్గించుకోవ‌డం ఆపాల‌ని, క్రెడిట్ తీసుకోవ‌డం త‌ప్పు కాద‌ని, ఆంబిష‌న్ ఉండ‌డం కూడా త‌ప్పు కాద‌ని, ఎవ‌రో పొగిడితే సింపుల్‌గా థాంక్యూ అన‌డం అహంకారం కాద‌ని అన్నారు. మ‌హిళ‌లు క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న గౌర‌వాన్ని అనుభ‌వించే హ‌క్కు వారికి ఉంద‌ని స‌మంత స్ప‌ష్టం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment